నల్లగొండ: ఓ వ్యక్తిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో నరికి చంపిన సంఘటన నల్ల గొండ జిల్లా కేంద్రం నడిబొడ్డులో చోటుచేసుకుంది. ఒక్కసారిగా ప్రజలు భయంతో వణికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సెంటర్ లోపల గీతాంజలి కాంప్లెక్స్ లో సమీపంలో పట్టపగలు నడిరోడ్డుపై గుర్తు తెలియని దుండగులు మాస్కులతో వచ్చి సురేష్ అనే వ్యక్తి వేట కత్తులతో దాడి చేసి చంపేశారు. విచక్షణారహితంగా గుండెల్లో పొడవడంతో పాటు మెడపైన వేట కత్తులతో దాడి చేసి చంపేశారు.
దాడిని తప్పించుకునే ప్రయత్నం చేసిన సురేష్ చివరకు అక్కడే కుప్పకూలిపోయాడు. ప్రత్యక్షసాక్షులు భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్(37) అనే వ్యక్తి మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాలా లేకపోతే పాత కక్షలు నేపథ్యంలో హత్య జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.