హైదరాబాద్: టిటిడి అధికారులు తమ సొంత ప్రణాళికలతో పనిచేస్తూ ధనవంతులైన భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షుతులు ఆరోపించారు. విఐపి సేవలో అధికారులు తరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆలయ అధికారులు ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తూ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం రమణదీక్షితులు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ
త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని టిటిడి ఇవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల భద్రత విషయంలో ఎక్కడా రాజీపడబోమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల డ్రోన్ వీడియో వ్యవహారానికి సంబంధించి వైరల్ అయిన వీడియో నిజమైనదా? లేదా ఫేక్ వీడియో అనే విషయం తేలాల్సివుందన్నారు. ఆ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి ఎలా చేశారనేది గుర్తించడం జరుగుతుందని ఆయన చెప్పారు.
ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐవోసిఎల్‌కు పర్మిషన్ ఇచ్చింది వాస్తవమేనని అన్నారు. అయితే కారిడార్ ఏర్పాటు చేసుకునేందుకు అన్నదానం దగ్గర నుంచి గార్బెజ్ సెంటర్ వరకు డ్రోన్ సర్వేకు ఐవోసిఎల్ పర్మిషన్ అడిగితే ఇచ్చామని ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో మాత్రమే సర్వేకు అనుమతి ఉందన్నారు.