జరిగిన తిరునక్షత్రోత్సవం, తిరుమంజన సేవ
మన తెలంగాణ/హైదరాబాద్: వెయ్యి సంవత్సరాల క్రితమే మానవ మనుగడలో సమానత్వాన్ని చాటిచెప్పిన తత్వవేత్త రామానుజుల జయంతి సందర్భంగా ఘనంగా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటి రోజైన మే 5వ తేదీ గురువారం నాటికి 1006 సంవత్సరాలు పూర్తవుతున్న తిరునక్షత్ర మహోత్సవ సందర్బంగా, ఈ నెల 9వ తేదీ వరకు ఐదురోజుల పాటు ఈ జయంతి ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 6:00 గంటలకు శ్రీమన్నారాయణుడి సుప్రభాత గోష్టితో మొదటిరోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
తదనంతరం నిత్యారాధనలో భాగంగా సువర్ణ రామానుజులవారికి మంగళ హారతులు, నవకలశ ఆరాధన పూజ నిర్వహించారు. పూజలో భాగంగా సంకల్పం చెప్పుకుని యజమానులకు కంకణ ధారణ చేశారు. తదనంతరం సువర్ణ రామానుజుల వారికి అభిషేకాలు నిర్వహించారు. అర్చకుల సూచన మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు భక్తులు త్రిపుండ్రకాలు, సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీమన్నారాయణుడి సేవలో పాల్గొన్నారు. అభిషేక కార్యక్రమాలనంతరం సువర్ణ రామానుజ స్వామికి ఆంతరంగిక సేవ, ధూప దీప నైవేద్యాలు సమర్పించి పదహారు ఉపచారాల పూజ నిర్వహించారు. తరువాత చినజీయర్ స్వామి చేతుల మీదుగా శ్రీభాష్యం అనే వేదాలతో కూడిన ప్రసిద్ధ ఆధ్యాత్మిక గ్రంధం ఆవిష్కృతమైంది. పుస్తకావిష్కరణానంతరం చినజియర్ స్వామి మాట్లాడుతూ, తిరునక్షత్ర మహోత్సవం ప్రాసస్త్యాన్ని వివరిస్తూ, ప్రసంగం మొత్తం ఆంగ్లంలో చేశారు.
తదుపరి ప్రసంగం తెలుగు, హిందీ భాషల్లో చేశారు. అనంతరం ఆయన స్వహస్తాలతో స్వర్ణ రామానుజులవారికి అభిషేక కార్యక్రమం, తిరుమంజనం నిర్వహించారు. తదుపరి అర్చకులు తిరుప్పావైని ఆలపించారు. సమతా క్షేత్రం అధికారులూ, అర్చకులూ తరలివచ్చిన భక్తులకి నారాయణుడి ప్రసాదవితరణ చేశారు. అనంతరం శ్రీమాన్ తిరుపుళ్ళాని సుందర రాజ స్వామి ప్రసంగిస్తూ శ్రీభాష్యం గురించి సంపూర్ణంగా వివరించారు. సాయంత్రం 5:30 గంటలకు సామూహిక విష్ణుసహస్రనామ పారాయణ నిర్వహించారు. అనంతరం శ్రీరామానుజ స్తోత్ర పారాయణ చేశారు. సంధ్యా హారతి పూర్తయిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా సంప్రదాయ నృత్యం, సంగీత కార్యక్రమాలు ఫౌంటేయిన్ ప్రాంగణంలో జరిగాయి. తదుపరి శ్రీరామానుజ తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం యావన్మంది భక్తులకూ క్షేత్ర అధికారులు ప్రసాదవితరణ చేశారు.