Wednesday, January 22, 2025

రామప్ప ఘనత

- Advertisement -
- Advertisement -

దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలనను ప్రతిబింబించే ‘పురాతన కట్టడాలు‘ ప్రపంచ వ్యాప్తంగా అనేకం నెలకొన్నాయి. వీటిని సంరక్షించి భవిష్యత్తరాలకు అందిం చే బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరిపై ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘యునెస్కో’ (యుఎన్‌ఎస్‌సిఒ) ఆధ్వర్యంలో ‘ప్రపంచ వారసత్వ ప్రదేశాల’ గుర్తింపు, నిర్వహణ జరుగుతుంది. ప్రపంచ దేశాల్లోని వారసత్వ సంపద పరిరక్షణకై ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ పురాతన కట్టడాలు స్థలాల పరిరక్షణ సంఘం సంయుక్తంగా ఆఫ్రికాలోని ‘ట్యునీషియా’లో 1982 ఏప్రిల్ 18న సమావేశం నిర్వహించింది. ఆ రోజును ప్రతి ఏటా ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం వారసత్వ మార్పు లు అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరగనుంది. వివిధ దేశాల్లోని అడవులు, పర్వతాలు, సరస్సులు, ఎడారిలు, కట్టడాలు, నగరాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీచే వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడతాయి.

ఒక దేశ సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ ఆ దేశ వారసత్వాన్ని భావితరాలకు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచ వ్యాప్తంగా యునెస్కో వారసత్వం ప్రదేశాలు 1157 ఉన్నాయి. ఇందులో 900 సాంస్కృతిక, 218 సహజ సిద్ధ, 39 మిశ్రమ స్థలాలుగా పేర్కొనడం జరిగింది. భారత దేశంలో 38 ప్రపంచ వారసత్వ స్థలాలు గుర్తింపు పొందాయి. 2021లో గుజరాత్‌లోని దోలవీరాదేవాలయం, తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడంతో ఇవి 40కి చేరాయి. అత్యధిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కలిగిన దేశాలలో భారత దేశం ఆరవ స్థానాన్ని ఆక్రమించింది. వారసత్వ స్థలాలు పర్యాటక కేంద్రాలుగా దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతాయి. దేశ చరిత్ర సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసే గుర్తులుగా ఉంటాయి. భారత దేశంలో పురాతన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే అనేక కట్టడాలు సింధు నాగరికత కాలం నుంచే ఉన్నవని చెప్పవచ్చు. మన దేశంలో వారసత్వ ప్రదేశాలుగా కోటలు, గుహలు దేవాలయాలు, మసీదులు, పరిపాలనా భవనాలు, వన్య సంరక్షణ కేంద్రాలు, పార్కులు మొదలైనవి అనేకం ఉన్నాయి.

మచ్చుకు కొన్ని పరిశీలిస్తే తాజ్ మహల్ అజంతా, ఎల్లోరా గుహలు, హంపి, సూర్య దేవాలయాలు కోణార్క్, పశ్చిమ కనుములు, ఎర్ర కోట, కజిరంగా అభయారణ్యం, కాంచన జంగ జాతీయ పార్కు లాంటివి పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని రామప్ప ఆలయం కాకతీయుల వాస్తు, శిల్పరీతికి తలమానికమైనది.రేచర్ల రుద్దుడు పాలంపేట ఏకశిలా పద్ధతిలో క్రీ.శ. 1213వ సంవత్సరం నిర్మించాడు. ఇది ఒక శివాలయం. దీని చుట్టూ పేరణి నృత్య భంగిమలు చెక్కబడి ఉన్నవి. ఆలయ నిర్మాణానికి నీళ్లలో తేలియాడే ఇటుకలు వాడడం ఆనాటి సాంకేతికతకు నిదర్శనం. ఈ దేవాలయం లో ఎటు చూసినా ప్రేక్షకుల వైపు చూస్తున్నట్లు ఉండే నంది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కాకతీయుల స్ఫూర్తిని కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వం ప్రదేశంగా గుర్తింపు రావడం శుభ సూచకం. దీంతో ఆలయం మరింత అభివృద్ధి చెంది, దేశ, విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించనుంది. వెలుగులోకి రాని ఇలాంటి ఆలయాలు, కట్టడాలు, నిర్మాణాలు తెలంగాణలో ఉన్నాయి. వీటిని మరింతగా అభివృద్ధి చేసి ప్రపంచ వారసత్వం ప్రదేశాలుగా గుర్తింపు తేవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉన్నది. అప్పుడే నేటి తరానికి వైవిధ్యమైన తెలంగాణ సాంస్కృతిక వారసత్వం భావితరాలకు చేరుతుంది. గోల్కొండ కోట లాంటి అతి పెద్ద కోటను ప్రపంచ వారసత్వ కేంద్రంగా మార్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి.

భారతీయ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలకు, కళా వైభవానికి పట్టుకొమ్మలుగా నిలుస్తున్న పురాతన కట్టడాలు సంరక్షణ రోజురోజుకు ప్రశ్నార్ధకంగా మారింది. దేశంలోని చాలా చారిత్రక కట్టడాలు వివిధ కారణాలతో కళను కోల్పోతున్నాయి. పాలరాతితో నిర్మించిన చారిత్రక కట్టడాలు కాలుష్యానికి గురవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నా రు. దీనికి నిదర్శనం ఆగ్రాలోని తాజ్ మహల్. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, కాలుష్యం, అక్రమ నిర్మాణాలు, భద్రత లేమి, సహజ విపత్తులు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటివి మన చారిత్రక, పురాతన కట్టడాలుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. తెలంగాణకే తలమానికమైన అపురూపమైన వరంగల్ రామప్ప దేవాలయం సైతం ప్రమాదంలోపడే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కింద పని చేసే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షణ, నిర్వహణలో ఈ కట్టడం ఉంది. కావునా చారిత్రక కట్టడాల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. భారత దేశంలో నిధులు లేని తక్కువ స్థాయి శాఖగా పురావస్తు శాఖను పేర్కొంటారు. భారతీయులకు ఇతిహాసాల మీద ఉన్న శ్రద్ధ చరిత్ర మీద లేదనే విమర్శ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలలో ‘వారసత్వ పరిరక్షణ’ అంతర్భాగంగా పేర్కొనబడినది.

దీనికి అనుగుణంగా 1984లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థను ఏర్పాటు చేసింది. కొన్ని వారసత్వ ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా ప్రకటించి ఆర్థిక వనరుగా మార్చడం జరిగింది. వారసత్వ నగరాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2015 జనవరి 21న హృదయ్ (HRIDAY -heritage city development and augmentation yojana) కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి. ఘనమైన చరిత్ర కలిగి ఇంకా వెలుగులోకి రాని అనేక చారిత్రక కట్టడాలను వెలికి తీయాలి. తద్వారా మన దేశం ఉనికి ప్రపంచ వ్యాప్తం అవుతుంది. ప్రపంచ దేశాలు సైతం సమన్వయంతో వారసత్వ ప్రదేశాలు రక్షణకు కృషి చేయాలి. అప్పుడే ఇవి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ, భవిష్యత్తరాలకు మన చరిత్ర, సంస్కృతి చేరవేస్తాయి.

సంపతి రమేష్ మహారాజ్
7989579428

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News