శతాబ్దాల చరికత్రకు గుర్తింపొచ్చింది. కాకతీయుల కళావైభవానికి యావత్ ప్రపంచం సలాం చేసింది. ఇసుక పునాదులపై వెలిసిన అద్భుత రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా లభించింది. యావత్ భారతావనికి, ముఖ్యంగా తెలంగాణ గడ్డకు గర్వకారణంగా నిలిచిన ఈ సందర్భం ప్రజలను పులకరింపజేసింది. 1213లో కాకతీయ గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు రామప్ప అనే శిల్పకళా నైపుణ్యుడితో సహాయంతో నిర్మించాడు. ఈ ఆలయాన్ని అపురూపంగా మలిచిన స్తపతి రామప్ప పేరుతోనే ఈ ఆలయానికి ప్రాచుర్యం లభించింది. భూకంపాలు వచ్చిన తట్టుకునే ఇసుక రాతి పునాది, నీటిలో తేలియాడే ఇటుకలు కాకతీయ నిర్మాణ శైలిలో అబ్బురపరిచే అంశాలు. గర్భాలయ ముఖద్వారం, స్తంభాల నిర్మాణం, వాటిని నిలబెట్టిన తీరు ప్రపంచంలో కాకతీయ శిల్పులకు మాత్రమే అబ్బింది. ఆ నాటి సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక రామప్ప.
రామప్ప దేవాలయానికి ఘనచర్రిత ఉంది. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఆయన తండ్రి పేరు కాటయ. ఆయన తన హయాంలో పలు చెరువులు తవ్వించాడని రామప్ప దేవాలయ శాసనాలు చెబుతున్నాయి. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రేచర్ల రుద్రుడు తటాకాలు తవ్వించడంతో పాటు రామప్ప ఆలయాన్నీ కట్టించాడు. ఆలయ సమీపంలో విశాలమైన చెరువు కూడా రేచర్ల రుద్రుడు నిర్మించిందేనని పలు శాసనాలు చెబుతున్నాయి.
తేలే ఇటుకలు
రామప్ప ఆలయ విమాన గోపురం నిర్మాణంలో వాడిన ఇటుకలు చాలా ప్రత్యేకమైనవి. ఆలయం మొత్తం బరువైన రాతితో నిర్మించారు. గోపురాన్ని కూడా రాతితో కడితే పునాదులు బరువును తట్టుకోవడం కష్టమని భావించి, తేలికైన ఇటుకలను రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు ఏనుగు లద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు. ఈ పదార్థాలన్నీ సరైన మోతాదులో ఉపయోగించి గట్టిదనం ఉంటూనే, తేలికగా ఉండే ఇటుకలను రూపొందించారు. ఇవి నీటిలో తేలుతాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ ఇటుకల సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండటం వల్ల అవి నీటిలో తేలుతాయి. ఇటుకల లోపలి భాగంలో స్పాంజిలా బోలుతనం ఉంటుంది. నిర్మాణంలో వీటిని ఉపయోగించినప్పుడు సున్నం, బెల్లం పాకం లాంటివి పీల్చుకొని కట్టడం దృఢంగా ఉండేలా చేస్తాయి. కాకతీయ శిల్పులకు మాత్రమే సొంతమైన పరిజ్ఞానమిది. అలనాటి సాంకేతిక పరిజ్ఞానానికి తార్కాణమిది.
అరుదైన శిల్పరీతి
భారతీయ శిల్పరీతుల్లో కాకతీయులది ప్రత్యేకశైలి. శాతవాహనుల తర్వాత, అంతటి రూప లావణ్యం కలిగిన శిల్పాలు కాకతీయుల హయాంలోనే ప్రాణం పోసుకున్నాయి. దేవాలయాల్లోని స్తంభాల నిర్మాణం, వాటిని నిలబెట్టిన తీరు, గర్భాలయ ముఖద్వారాలను బట్టి అవి కాకతీయులు కట్టించినవే అని సులభంగా చెప్పవచ్చు. కాకతీయ నిర్మాణాలకు 200 సంవత్సరాలకు పూర్వమే హోయసల పాలకులు బేలూరు, హళేబీడు, సోమనాథపురాలలో అద్భుతమైన గుళ్లు నిర్మించారు. ఆ ఆలయాల మీద కనబడే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటివి కాకతీయ ఆలయాల్లోనూ కనిపిస్తాయి. అయితే, హోయసల శిల్పరీతికీ కాకతీయుల శిల్ప శైలికీ కొన్ని భేదాలు చూడొచ్చు. హోయసల శిల్పులు ఆలయాల వెలుపలి వైపు మాత్రమే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కాకతీయ ఆలయాల్లో లోపలి భాగంలోనూ అద్భుత శిల్పాలు దర్శనమిస్తాయి. హోయసల ఆలయాలపై కనిపించేవి దేవతా మూర్తులు కాగా, కాకతీయ ఆలయాలపై కనిపించేవి నాటి సామాన్య స్త్రీ పురుషులవి. సామాన్యుల వేషధారణ, సామాజిక అంశాలను వందల ఏండ్లపాటు సజీవంగా ఉండేలా ఆలయ కుడ్యాలపై చెక్కించిన ఘనత కాకతీయులదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు.
స్వరాలు పలికే శిల్పం
ప్రధాన ఆలయానికి కుడివైపున ఉన్న శిల్పం చాలా ప్రత్యేకమైంది. ఒక స్త్రీ అరటి చెట్టుని తన ఎడమ చేతితో వంచి పట్టుకున్నట్లుగా ఉంటుందీ ఈ ఏకశిలా మూర్తి. చేతి వేళ్లతో తట్టినట్లు తాకితే ఆ రాతినుంచి సుస్వరాలు వినిపిస్తాయి. బయటకు చూడటానికి రాతిలో ఎలాంటి బోలుదనం ఉన్నట్టుగా అనిపించదు. కానీ, ఇలా తట్టగానే అలా స్వరాలు పలకడం శిల్పి ప్రతిభకు తార్కాణం.
నల్లరాతి శిల్పాలు
కఠినమైన రాతిపై శిల్పాలు చెక్కిన తర్వాత అద్దంలాంటి నునుపుదనం వచ్చేంత వరకు చిత్రిక పట్టారు. ఆలయ కప్పు భారాన్ని మోయడానికి నల్లరాతి గ్రానైట్ శిల్పాలను వాడటం అబ్బురపరిచే విషయం. ప్రతి శిల్పం ప్రత్యేకమయ్యిందే. వాటి ముఖాల్లో విభిన్న హావభావాలు కనిపిస్తాయి. విమాన గోపురం నిర్మాణం కోసం నీటిలో తేలే ఇటుకలను వినియోగించారు.
గతమెంతో ఘనం
కాకతీయ పాలనా కాలంలో క్రీ.శ.1213 నుండి 1323 వరకు దాదాపు 110 ఏండ్లు నిత్యం పూజాదికాలతో, ఉత్సవాలతో ఓ వెలుగు వెలిగిన రామప్ప ఆలయం పద్నాలుగో శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానుల విధ్వంసకాండకు గురైంది. రామప్ప ఆలయంపై విరుచుకుపడిన ముష్కరులు గోపురాన్ని ధ్వంసం చేశారు. ఇదే సమయంలో అనేక అపురూప విగ్రహాలను విరిచేశారు. ఇసుకతో నిర్మించిన పునాది కావడంతో శతాబ్దాలు గడిచేసరికి కుంగిపోవడానికి కారణమైంది. వర్షపు నీరు పునాదిలో ఇంకిపోవడం వల్ల కూడా ఆలయం కుంగింది. ఆలయం సమీపంలో ఉన్న రామప్ప చెరువు నీటి బరువు ప్రభావం కూడా పునాదిపై ఉంది. ఫలితంగా ఆలయం కుంగి స్తంభాలు, పైకప్పు, గోడలు పగుళ్లు చూపాయి.
నిర్మాణ పద్ధతి…
కాకతీయుల పాలన శిల్ప కళకు స్వర్ణయుగం, అందులోనూ త్రికూటాలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే, రామప్ప గుడి త్రికూటాలయం కాదు. కానీ, ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు. ఉత్తర, దక్షిణ దిశల్లోనూ ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం మధ్యభాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు. శతాబ్దాలుగా చెక్కుచెదరని ఈ ఆలయానికి ఇసుకతో పునాదిని నిర్మించారు. నల్లని గ్రానైట్ (చలువరాయి) శిలలను ప్రత్యేకంగా తెప్పించి ఆలయ రంగ మంటపం కట్టారు.
ఇసుక రాతిపెట్టె పరిజ్ఞానం…
కాకతీయులు నిర్మించిన ఆలయాలన్నీ దాదాపు శాండ్బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు. ఆలయ పునాదుల్లో 12 నుంచి 15 అడుగుల లోతులో సన్నని ఇసుకను నింపి, దానిపైన రాళ్లతో పునాదులు వేశారు. భూకంపాలు వచ్చినా ఆలయం కుంగకుండా ఉండేందుకే ఈ విధానాన్ని అనుసరించారు. అందుకే, 800 ఏళ్లలో ఎన్నో భూకంపాలు వచ్చినా కూడా, ఇసుక షాక్అబ్జర్లా పనిచేశాయి.
స్థపతి పేరిట ప్రాచుర్యం..
అద్భుత శిల్పకళతో అలరారే రామప్ప ఆలయ గర్భగుడిలో చిత్రిక పట్టిన పానపట్టంపై రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. తన శిల్పకళతో ఆ ఆలయం అణువణువునూ అపురూపంగా మలిచిన శిల్పాచార్యుడు, స్థపతి రామప్ప పేరుతో ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది ఈ విషయాన్ని ప్రతిపాదిస్తూ ఎన్నో జానపద, మౌఖిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రామప్ప ప్రధాన దేవాలయ, ఉపాలయాల నిర్మాణం దశాబ్దాలపాటు కొనసాగింది.