మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి వాటాలను సాధించి పెట్టేందుకు ఆర్.విద్యాసాగర్ రావు నిరంతర పోరాటం చేశారని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు దామోదర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు జలసౌధలో ప్రభుత్వ సాగునీటి రంగం మాజీ సలహాదారు దివంగత రామరాజు విద్యాసాగర్ రావు 5 వర్ధంతి సభ జరిగింది. తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం , తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం , హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్‌ల అధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లు విద్యాసాగర్‌రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదీజలాలలో తెలంగాణకు న్యాయబద్దంగా దక్కాల్సిన వాటానీటికోసం విద్యాసాగర్ రావు ఎంతగానో శ్రమించారన్నారు. కేంద్ర జలసంఘంలో పనిచేసిన ఆయన నీటిపారుదల రంగంలో ఆపార అనుభవం గడించి తన అనభవాన్నంతా రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసం ఉపయోగించాన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా విద్యాసాగర్ రావు సేవలను కొణియాడారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ల సంఘం మాజీ అధ్యక్షుడు సంగెం చంద్రమౌళి, సిఎం ఒఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఇంటర్‌స్టేట్ చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్ , ప్రొఫెసర్ రమణా నాయక్ , దేశబోయిన రమ , ఇంద్రసేనారెడ్డి, రాంరెడ్డి, అనిత, తదతరులు పాల్గొన్నారు.