Monday, December 23, 2024

వైట్ హౌస్ రేసు నుంచి రామస్వామి ఔట్

- Advertisement -
- Advertisement -

ప్రైమరీ తొలిపోరులోనే ప్రభావం అంతంతే
అధ్యక్ష పోటీలో ట్రంప్ హవా రిపబ్లికన్
తొలిపోరులో మాజీ అధ్యక్షుడి ఘన విజయం

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో ఇది మొదటిది. ఇందులో ట్రంప్ అత్యధిక మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు 51 శాతం ఓట్లు రాగా.. 21.2 శాతం ఓట్లతో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డి శాంటిస్ రెండో స్థానంలో నిలిచారు.19.1 శాతంతో ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ మూడో స్థానం దక్కించుకున్నారు.ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారతీయ సంతతి నేత వివేక్ రామస్వామి ప్రైమరీ తొలిపోరులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 7.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయోవానుంచి మొత్తం 40 ప్రతినిధి ఓట్లు ఉండగా ట్రంప్‌కు 20 ప్రతినిధి ఓట్లు లభించనున్నాయి. డి శాంటిస్‌కు ఎనిమిది, నిక్కీ హేలీకి ఏడు ప్రతినిధి ఓట్లు లభించనున్నాయి. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో మొత్తం 2,429 ప్రతినిధులు ఉండగా, అభ్యర్థిగా ఎన్నిక కావడానికి కనీసం 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాలి. అయోవాలో ప్రస్తుతం విపరీతంగా మంచు కురుస్తోంది. అయినప్పటికీ ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవా కాకసస్‌తో ఈ ప్రక్రియ మొదలైంది.

జనవరి 23న న్యూహాంపషైర్‌లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి.అక్కడినుంచి వరసగా పలు రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. తొలి పోలింగ్‌లో ట్రంప్ ఘన విజయంతో రిపబ్లికన్ పార్టీపై ఆయన పట్లు ఏమాత్రం కోల్పోలేదని స్పష్టమయింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్ పై రెండు రాష్ట్రాలు వేటు వేసిన విషయం తెలిసిందే. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొలరాడో, మైన్ రాష్ట్రాలు ఆయనపై నిషేధం విధించాయి. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కాగా అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ పోటీ పడుతుండడం ఇది మూడో సారి. 2016లో అధ్యక్ష పదవి చేపట్టిన ఆయన 2020లో డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా, తాజా ప్రైమరీ పోరులో విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీపడతారనే అంచనాలు వెలువడుతున్నాయి.

పోటీనుంచి తప్పుకున్న రామస్వామి
కాగా అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసునుంచి తప్పుకొంటున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ప్రకటించారు. అయోవా ప్రైమరీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని తరుణంలో వివేక్ రామస్వామినుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అలాగే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తన మద్దతు ఉంటుందని తెలిపారు. బుధవారం న్యూహాంప్‌షైర్‌లో జరిగే ర్యాలీలో ట్రంప్‌తో పాటుగా తాను కూడా పాల్గొంటానని కూడా రామస్వామి చెప్పారు. రామస్వామి పోటీనుంచి తప్పుకోవడంతో అధ్యక్ష అభ్యర్థికోసం రిపబ్లికన్ పార్టీలో పోటీ ఇప్పుడు ట్రంప్, తన మధ్యనే ఉంటుందన్న ఆశాభావాన్ని నిక్కీ హేలీ వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా హేలీకి రిపబ్లికన్ పార్టీలో మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News