శివరాజ్ సింగ్‌పై రామాయణ్ పాత్రధారి పోటీ
మధ్యప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 144 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్ ఆదివారం విడుదల చేసింది. సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై 2008 రామాయణ్ టీవీ సీరియల్‌లో హనుమాన్ పాత్రధారి విక్రమ్ మస్తల్‌ను బరిలోకి దింపింది. బుధ్ని అసెంబ్లీ నియోజకవర్గంనుంచి ఈ ఇద్దరూ పోటీ పడతారు. ఈ ఏడాది జులైలో కాంగ్రెస్‌లో చేరిన మస్తల్‌ను కీలక నియోజకవర్గంలో పోటీకి ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిపింది.పిసిసి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఇక బిజెపి ఇటీవల విడుదల చేసిన నాలుగో జాబితాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ బుధ్ని నియోజకవర్గంనుంచి పోటీ చేస్తారని ప్రకటించిన విషయం తెలిసింది. బుధ్ని నియోజకవర్గం చౌహాన్‌కు కంచుకోటగా పేరొందింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంనుంచి చౌహాన్ ఏకంగా 58 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఇక కాంగ్రెస్ జాబితాలో పిసిసి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు చింద్వారా స్థానం దక్కింది.మాజీ సిఎం దిగ్విజయ్ సింగ్ కుమారుడు, రాజ్యసభ సభ్యుడు జైవర్ధన్ సింగ్ రాఘవ్ గఢ్ స్థానంనుంచి సోదరుడు లక్ష్మణ్ సింగ్ చచౌరా స్థానంనుంచి పోటీ చేస్తారు. కాగా కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో చాలా మంది గడచిన కమల్‌నాథ్ లేదా, దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వాల్లో మంత్రులుగా పని చేసిన వారే ఉన్నారు. ఇండోర్ సిటీలో ఇండోర్ 1 స్థానంనుంచి సిట్టింగ్ ఎంఎల్‌ఎ సంజయ్ శుక్లాను పార్టీ బరిలోకి దింపింది. ఇక్కడ బిజెపి అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ పోటీ చేయనున్నారు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెల 17న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్లు లెక్కిస్తారు.