అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం యావద్దేశం ఎదురుచూస్తుండగా లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ తరహాలో రాముని జన్మభూమిలో ఒక మైనపు ప్రదర్శన శాలలో త్వరలోనే ప్రారంభం కానున్నది. రామాయణం ప్రధాన ఇతివృత్తంగా ఏర్పాటు అవుతున్న ఈ మ్యూజియంలో రామాయణంలోని ప్రధాన పాత్రలకు చెందిన దాదాపు 100 నిలువెత్తు మైనపు విగ్రహాలు కొలువు తీరనున్నాయి. ఈ మ్యూజియానికి మొదటి దశ 2024 ఏప్రిల్ లేదా మే నాటికి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. రామాయణంలోని సీతా స్వయంవరం, వనవాసం, లంకా దహనం తదితర ఘట్టాలకు చెందిన సుమారు 30 నుంచి 35 సన్నివేశాలకు చెందిన చిత్రాలు కూడా ఈ మూజియంలో ఉండనున్నాయి. రామాయణ మైనపు(వ్యాక్స్) మ్యూజియాన్ని నిర్మించే టెండర్‌ను ముంబైకి చెందిన ప్రముఖ చిత్రకారుడు, మైనపు విగ్రహాల రూపశిల్పి సునీ కండల్లూర్ దక్కించుకున్నారు. ఈ మ్యూజియం నిర్మాణానికి రూ. 7 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టును సునీల్ చేపట్టారు. మ్యూజియం టెండర్ కోసం తాను ఒక్కడినే దరఖాస్తు చేసుకున్నానని,
దీంతో టెండర్‌ను రద్దు చేసి మరోసారి పిలవగా అప్పుడు కూడా తన ఒక్కడి దరఖాస్తే రావడంతో టెండర్ తనకు దక్కించదని, ఇది రాముడు తనకు అందించిన కానుకగా భావిస్తున్నానని సునీల్ తెలిపారు. సునీల్ గతంలో నరేంద్ర మోడీ, సచిన్ టెండుల్కర్, శరద్ పవార్, అన్నా హజారే, బాల్ థాక్రే, రజనీకాంత్, ఎంజి రామచంద్రన్ తదితరుల 170కి పైగా నిలువెత్తు మైనపు శిల్పాలను తయారుచేసి విశేష ఖ్యాతిని ఆర్జించారు. ఈ విగ్రహాలను కన్యాకుమారి(తమిళనాడు), టేక్కడి(కేరళ), లోనావాలా(పుణె)లోని గ్యాలరీలలో చూడవచ్చు. మోడీ విగ్రహాన్ని ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే 2013లో తయారు చేశామని, ముంబైలో ఆ విగ్రహాన్ని మోడీ స్వయంగా ప్రారంభించారని సునీల్ సోదరుడు సుభాష్ తెలిపారు. ప్రస్తుతం అయోధ్యలో రామాయణ మ్యూజియం నిర్మించే బాధ్యతను సునీల్‌తోపాటు ఆయన సోదరులు సుభాస్, సుజిత్ చూసుకుంటున్నారు. అయోధ్యలో మొదటి దశ కోసం 80 విగ్రహాల తయారీకి సబంధించిన పనులు జరుగుతున్నాయని,
ఐదుగురు కార్మికులు మైనపు విగ్రహాల తయారీ చేస్తుండగా వాటికి తుది రూపును, పెయింటింగ్ పనులను తాను నిర్వహిస్తానని సునీల్ తెలిపారు. మొదటి దశలో రామ కథ కోసం 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మ్యూజింయం ఏర్పాటవుతుందని, రెండవ దశలో కృష్ణ కథ ఆధారంగా మ్యూజియం ఉంటుందని ఆయన చెప్పారు. మొత్తం రూ. 7 కోట్ల బడ్జెట్‌ను ఇందుకోసం కేటాయించగా ఇందులో రూ. 5 కోట్లు మొదటి దశ కోసం ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. శ్రీరాముడి మైనపు విగ్రహం తయారీ కోసం తాను అనేక గ్రంథాలను చదవడంతోపాటు అయోధ్యలో గత కొద్ది మాసాలుగా తిరుగుతూ రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడి చిత్రాలను అనేక చూడడం జరిగిందని, వీటన్నటినీ పరిశీలించిన విగ్రహాల రూపురేఖలపై ఒక అవగాహనకు రావడం జరిగిందని సునీల్ తెలిపారు. మానవ చర్మాన్ని పోలే విధంగాఉండే అడ్వాన్డ్ సిలికాన్‌ను ఉపయోగించడం ద్వారా నిజమైన వ్యక్తులను చూస్తున్నామా అని భ్రమించే విధంగా ఈ విగ్రహాలు కనిపిస్తాయని ఆయన తెలిపారు.
సిలికాన్, మైనం, ఫైబర్‌గ్లాస్‌తోపాటు ఇతర అధునాతన వస్తువులను ఉపయోగించి ఈ విగ్రహాలను తయారు చేస్తున్నామని ఆయన చెప్పారు. అనేక పాత్రలను ఈ విగ్రహాలలో చూచడవచ్చని ఆయన చెప్పారు. ఉదాహరణకు వనవాసానికి వెళుతున్న రాముడిని, లవకుశులతో ఆడుకుంటున్న రాముడిని, రావణుడితో యుద్ధం చేస్తున్న రాముడిని ఇలా అనేక సన్నివేశాలలో ఉన్న రాముడిని ఈ విగ్రహాలలో చూడవచ్చని ఆయన చెప్పారు.