జైపూర్: యోగా గురు రాందేవ్ బాబా తాజాగా ముస్లింలు, క్రైస్తవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నమాజ్ పేరుతో ముస్లింలు ఉగ్రవాదులను తయారు చేయడంలో బిజీగా ఉండగా క్రైస్తవులు మతమార్పిడులు నిర్వహించుకుంటూపోతున్నారని రాందేవ్ ఆరోపించారు. రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ మీ మతం ఏం బోధిస్తుందని ఏ ముస్లిమునైనా అడిగితే రోజూనమాజ్ చదవండి..హిందూ మహిళలను కిడ్నాప్ చేయడంతోసహా ఇష్టమొచ్చిన పని ఏదైనా చేయండి అని చెబుతారని అన్నారు. ఇస్లాం అంటే ఇదీ వారిచ్చే నిర్వచనమని రాందేవ్ అన్నారు. మన ముస్లిం సోదరులు పాపులని కూడా ఆయన ఆరోపించారు.
ముస్లింలు నమ్మే స్వర్గంలో అప్సరసలు, మద్యం ఉంటుందని, వీరు చేసే పనల్లా మీసాలు తీసేసి, తెల్ల కుర్తా పైజామా, టోపీ ధరించడమేనని ఆయన అన్నారు. ఇస్లాం కాని ఖురాన్ కాని ఇవేవీ చెప్పనప్పటికీ వీటినే ముస్లింలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఇస్లాంను కాని ఖురాన్‌ను కాని తప్పు పట్టడం లేదని కూడా రాందేవ్ వివరణ ఇచ్చారు.
క్రైస్తవులను ప్రస్తావిస్తూ క్రైస్తవ మతం ఏం చెబుతోందని ఆయన ప్రశ్నించారు. చర్చికి వెళ్లి కొవ్వొత్తి వెలిగించి ఏసుక్రీస్తు ముందు నిలబడితే చాలు మీ పాపాలన్నీ కొట్టుకుపోతాయని ఆయన అన్నారు. క్రైస్తవులు ధరించే శిలువను ప్రస్తావిస్తూ వారి మెడలో శిలువను పోలిన గొలుసుతోపాటు హిందువులు ధరించే విధంగా ఇతర గొలుసులు కూడా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.
తాను ఏ మతానికి వ్యతిరేకం కానని కూడా ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అయితే మతమార్పిడులను సైతం ఆయన ప్రస్తావించారు. యావత్ ప్రపంచం ఇస్లాంగా మారిపోవాలని ముస్లింలు కోరుకుంటుంటే మొత్తం ప్రపంరం క్రైస్తవాన్ని నమ్మాలని క్రైస్తవులు ఆశిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాం దేవ్ బాబా ప్రసంగం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Location: Barmer, Rajasthan
Yoga Guru Baba Ramdev delivers hateful speech targeting Muslims and Christians. pic.twitter.com/s4tFXseGZ9
— HindutvaWatch (@HindutvaWatchIn) February 3, 2023