బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను తదుపరి దర్యాప్తు కోసం 10 రోజుల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) కస్టడీని మంజూరు చేస్తూ ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. కోల్‌కత సమీపంలో అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులు ముస్సావీర్ హుస్సేన్ షాజీబ్, అబ్దుల్ మథీన్ అహ్మద్ తాహాను ఎన్‌ఐఎ అధికారులు శనివారం ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టులో హాజరుపరిచారు. మార్చి 1న బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోగల రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించి 10 మంది గాయపడ్డారు.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్న వీరిద్దరినీ కోల్‌కతా సమీపంలో అరెస్టు చేసి ట్రాన్సిట్ రిమాండ్‌పై ఇక్కడకు తీసుకువచ్చారు. రామేశ్వరం కేఫ్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఇడి)ని షాజీబ్ అమర్చగా తాహా ఈ కుట్రకు సూత్రధారని ఎన్‌ఐఎ తెలిపింది. ఈ ఇద్దరు నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల చొప్పున బహుమానాన్ని అందచేస్తామని ఎన్‌ఐఎ గత నెల ప్రకటించింది. ఇలా ఉండగా&కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు నిందితులను అరెస్టు చేసినందుకు ఎన్‌ఐఎ, రాష్ట్ర పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంటరాగేషన్ తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు.