Monday, December 23, 2024

త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక

- Advertisement -
- Advertisement -

ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు వెల్లడించాయి. 2029 నుంచి అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర అసెంబ్లీల కాల పరిమితిని సమన్వయ పరిచే ప్రక్రియను సూచించడంతోపాటు లోక్‌సభ, అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలతోసహా స్థానిక సంస్థలకు ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలని కూడా తన నివేదికలో కమిటీ సూచించే అవకాశం ఉంది. జమిలి ఎన్నికల నిర్వహనపై అధ్యనం చేసి తన సిఫార్సులను సాధ్యమైనంత త్వరగా అందచేసేందుకు మాజీ రాష్ట్రపతి కోవింద్ సారథ్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని 2023 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యాంగంలోని ఐదు అధికరణలతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనలను కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్ సభల కాలం పరిమితిపై 83వ అధికరణ,

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు లోక్‌సభ రద్దుపై 85వ అధికరణ, రాష్ట్ర అసెంబ్లీల కాలపరిమితిపై 172వ అధికరణ, అసెంబ్లీల రద్దుపై 174వ అధికరణ, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధింపుపై 356వ అధికరణను సవరించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుందగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్లు నిర్వహిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్లు నిర్వహించినప్పటికీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో సమన్వయం చేసుకోవలసి ఉంటుందని బిజెపి వంటి పార్టీలు కోవింద్ సారథ్యంలోని కమిటీకి సూచించాయి. జమిలి ఎన్నికలు నిర్వహించిన పక్షంలో ప్రతి 15 సంవత్సాలకు ఒకసారి ఇవిఎంలు మార్చడానికి రూ.10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. ఇవిఎంల జీవితా కాలం 15 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని, జమిలి ఎన్నికలు నిర్వహించిన పక్షంలో ఒక్కో సెట్ ఇవిఎంతో మూడు ఎన్నికలను మాత్రమే నిర్వహించవచ్చని గత ఏడాది కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో ఎన్నికల కమిషన్ వివరించింది.

కాగా..జమిలి ఎన్నికలపై న్యాయ సంఘం కూడా తన నివేదికకు తుది మెరుగులు దిద్దుతోంది. జమిలి ఎన్నికలపై రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చాలని న్యాయ సంఘం సూచించనున్నది. 2029 మధ్య నాటికి మూడు విడతలలో రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలాన్ని సమన్వయం చేసేందుకు ఒక రోడ్డుమ్యాప్‌ను న్యాయ సంఘం సూచించే అవకాశం ఉంది. జస్టిస్(రిటైర్డ్) రీతూ రాజ్ అవస్తి నేతృత్వంలోని న్యాయ సంఘం జమిలి ఎన్నికలపై ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చడానికి రాజ్యాంగానికి సవరణను సిఫార్సు చేయనున్నది. కొత్త అధ్యాయంలో జమిలి ఎన్నికలు, జమిలి ఎన్నికల మనుగడ, ఉమ్మడి ఓటర్ల జాబితా వంటి అంశాలు ఆ అధ్యాయంలో ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కనీసం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగేఅవకాశం ఉంది.

వచ్చే ఏడాది బీహార్, ఢిల్లీ అసెంబ్లీలకు ఎన్నికలుజరగవలసి ఉంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీలకు 2026లో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీలకు 2027లో ఎన్నికలు జరగవలసి ఉంది. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్, కర్నాటక, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీలకు ఎన్నికలు జరగవలసి ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News