Sunday, January 19, 2025

రామోజీరావు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ : చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

టిడిపి అధినేత చంద్రబాబు-భువనేశ్వరి దంపతులు రామోజీ ఫిలింసిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో రామోజీరావు చిరస్థాయిగా ఉంటారని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. మార్గదర్శి, ఈనాడు, ఈటివి, ఫిలింసిటీ సహా అనే వ్యవస్థల నిర్మాణంతో తెలుగుజాతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అలాంటి మహాయోధుడి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. రామోజీరావు తెలుగు వెలుగు అని, సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించానని ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని భావోద్వేగానికి గురయ్యారు.

ప్రమాణస్వీకారం తర్వాత రామోజీని కలుద్దామనుకున్నా: పవన్ కల్యాణ్ –

పిఠాపురం ఎంఎల్‌ఎగా పమాణస్వీకారం చేసిన తర్వాత వచ్చి రామోజీరావును కలుద్దామనుకున్నానని, ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో ఉంచిన రామోజీరావు పార్థివదేహానికి పవన్ నివాళులు అర్పించారు. ఆయన వెంట వచ్చిన టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) కూడా రామోజీకి అంజలి ఘటించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన వారేనని తెలిపారు. ఎంతో మంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు ఆయన అని కొనియాడారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వారికి రామోజీ రావు అండగా నిలబడ్డారని అన్నారు.

కెసిఆర్ సంతాపం
ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు మృతిపట్ల బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. శోకతప్తులైన రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామోజీ రావు మొబైల్ ఎన్‌సైక్లోపీడియా : కేటీఆర్
‘ఈనాడు అధినేత రామోజీరావు పార్థివదేహానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎంఎల్‌ఎలు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి నివాళులర్పించారు. తెలుగు పత్రికా రంగంతో పాటు తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు రామోజీరావు బీజం వేశారు. ఈనాడు పత్రిక స్థాపించిన తర్వాత, ఈటివి ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రొఫెషనిలజంతో, విలువలతో కూడిన జర్నలిజానికి రామోజీరావు గుర్తుగా నిలిచిపోతారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ఆయన ఎంతో తపన పడ్డారు’ అని కెటిఆర్ అన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం

రామోజీ మృతి పట్ల సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్ రావు సంతాపం తెలిపారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం నేడు అందరికీ ఆదర్శమని చెప్పారు. తెలుగువాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటిచెప్పారని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి నివాళులు

మరోవైపు రామోజీ పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామోజీరావు ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపంలో పెట్టేవారని, ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఆయన చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదని కొనియాడారు. రామోజీరావు మృతి ఆయన కుటుంబానికే కాదని, తెలుగు జాతికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహావ్యక్తిని, శక్తిని కోల్పోయామని వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News