Monday, January 20, 2025

పాత్రికేయ చైతన్య కిరణం రామోజీ

- Advertisement -
- Advertisement -

ఈనాడు’ తొలి రోజు పత్రిక మొదటి పేజీలో అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ వాటర్‌గేట్ కుంభకోణం ఒకవైపు, మరోవైపు ప్రాంతీయ వార్త ‘ఆమదాలవలస చెరకు రైతుల సమ్మె’ ప్రముఖంగా ప్రచురించారు. అప్పటి నాలుగు పేజీల ‘ఈనాడు’ బ్లాక్ అండ్ వైట్ పత్రిక ఖరీదు 25 పైసలుగా పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక క్రమేణా ‘ఈనాడు’ తిరిగి చూడలేదు. అయితే ‘ఈనాడు’ ప్రారంభంలో కొన్నేళ్లు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎమర్జెన్సీ రావడం, కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించడం ఇవన్నీ కష్టనష్టాలను కల్పించినప్పటికీ, చెక్కుచెదరక ఛైర్మన్ రామోజీ పత్రికను ముందుకు నడిపించారు.

పత్రికా, సినీ రంగాల్లో నూతన అధ్యాయాన్ని సృష్టించిన చైతన్యశీలి రామోజీరావు. వేలాది మంది పాత్రికేయులను తీర్చిదిద్దిన స్ఫూర్తి ప్రదాత. ఆయన మార్గదర్శకంలో మాలాంటి వారెందరో అక్షరాభ్యాసం చేసి గుర్తింపు పొందారు. ఆ రోజుల్లో పత్రికలన్నీ విజయవాడ నుంచి విశాఖ పట్టణానికి చాలా ఆలస్యంగా వస్తుండేవి. అప్పటి ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత కెఎల్‌ఎన్ ప్రసాద్‌తో కలిసి రామోజీరావు విమానంలో ప్రయాణించే సందర్భంలో ‘విజయవాడ నుంచి పత్రికలు విశాఖకు ఆలస్యంగా వస్తున్నాయని, విశాఖలోనే ప్రచురణ ప్రారంభిస్తే ఒరిస్సా వరకు సర్కులేషన్ సులభంగా వేగంగా జరుగుతుందని’ సూచించారు.

దానికి కెఎల్‌ఎన్ ప్రసాద్ కొంచెం అసహనం చూపించి ‘పత్రికంటే నీకేం తెలుసు’ అని చులకన చేయడాన్ని రామోజీ రావు సవాలుగా తీసుకున్నారు. మనమే ఎందుకు విశాఖపట్నంలో పత్రిక ప్రారంభించకూడదు అని ప్రశ్నించుకున్నారు. అప్పటికి విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణంలో రామోజీరావు నిమగ్నమై ఉన్నారు. అయినాసరే విశాఖలో పత్రిక ప్రారంభించవలసిందేనన్న దృఢసంకల్పంతో ముందడుగు వేశారు. విశాఖ సీతమ్మధారలో గతంలో సినిమా స్టూడియోగా ఉపయోగపడిన పాత భవనాన్ని అద్దెకు తీసుకుని, పాత ప్రింటింగ్ మెషిన్‌ను కొనుక్కుని ప్రచురణ ప్రారంభించారు. 1974 ఆగస్టులో ‘ఈనాడు’ మొదటి పత్రిక వెలువడింది. అంతవరకు పత్రికలన్నీ జాతీయ, అంతర్జాతీయ వార్తలకే మొదటి పేజీలో ప్రాధాన్యం కల్పించేవి. కానీ ‘ఈనాడు’ మాత్రం ప్రత్యేకంగా ప్రాంతీయ వార్తలకే మొదటి పేజీలో చోటు కల్పించడం ప్రజలకు ఆసక్తి కలిగించింది.

అందుకే ‘ఈనాడు’ తొలి రోజు పత్రిక మొదటి పేజీలో అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ వాటర్‌గేట్ కుంభకోణం ఒకవైపు, మరోవైపు ప్రాంతీయ వార్త ‘ఆమదాలవలస చెరకు రైతుల సమ్మె’ ప్రముఖంగా ప్రచురించారు. అప్పటి నాలుగు పేజీల ‘ఈనాడు’ బ్లాక్ అండ్ వైట్ పత్రిక ఖరీదు 25 పైసలుగా పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక క్రమేణా ‘ఈనాడు’ తిరిగి చూడలేదు. అయితే ‘ఈనాడు’ ప్రారంభంలో కొన్నేళ్లు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎమర్జెన్సీ రావడం, కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించడం ఇవన్నీ కష్టనష్టాలను కల్పించినప్పటికీ, చెక్కుచెదరక ఛైర్మన్ రామోజీ పత్రికను ముందుకు నడిపించారు.

ఈ నేపథ్యంలో ‘ఈనాడు’ విశాఖలో పుటిన మూడేళ్లకు 1976 లో నాకు అందులో ప్రవేశించే మహద్భాగ్యం లభించింది. అప్పటికి విశాఖ ‘ఈనాడు’ ఎండీగా ఎం. అప్పారావు ‘ఈనాడు’ బాధ్యతలు నిర్వహిస్తుండేవారు. ప్రాంతీయ వార్తల విభాగం ఇన్‌ఛార్జి కె. అమర్ నేతృత్వం లో పని చేయడం ప్రారంభించాను. ఆ సమయంలో హైదరాబాద్‌లో శ్రీదేవి అనే బిఎ గ్రాడ్యుయేట్ ఉద్యోగం రాక, తన ఇద్దరు పిల్లలను పోషించుకోడానికి చెత్త ఏరుకుంటూ బతుకు సాగించేది. దీన్ని ‘ఈనాడు’ మానవతా కథనంగా కొన్ని రోజుల పాటు ఆమె దైన్యస్థితిని ప్రచురించడంతో ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఆమెకు ‘ఈనాడు’ ద్వారా దాతలు విరాళాలు పంపించి ఆదుకొన్నారు. ఈ వృత్తాంతం ఆధారంగా నేను ‘ఈనాడు శ్రీదేవి’ అనే శీర్షికతో బుర్రకథను విశాఖలో ‘ఈనాడు’ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శించాను. ఆ ప్రదర్శనను రామోజీ రావు కుటుంబమంతా చూసి మెచ్చుకున్నారు.

దాని తరువాత జిల్లా పత్రికల (టాబ్లాయిడ్స్) అవతరణ జరగడంతో ప్రాంతీయ పత్రికగా ‘ఈనాడు’కు ప్రజాదరణ మరింత పెరిగింది. డెస్క్ ఇన్‌ఛార్జులం కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రత్యేక వార్తలను ఇస్తుండడంతో సత్ఫలితాలు కనిపించాయి. ఈ పద్ధతి రామోజీరావు గారికి నచ్చింది. అన్ని యూనిట్లలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టించారు.ఉదాహరణకు విజయనగరం జిల్లా బొబ్బిలి, సీతానగరం చెరకు ఫ్యాక్టరీల రూ. కోటి 87 లక్షల రుణాల కుంభకోణాన్ని బయటపెట్టగలిగాం. అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ ఈ కుంభకోణంపై ప్రిస్ర్కైబ్డ్ అథారిటీని నియమించి దర్యాప్తు చేయించడంతో అక్రమ కేసుల్లో ఇరుక్కున్న రైతులకు, కార్మికులకు విముక్తి కలిగింది. ఈ రుణబాగోతం ఇతివృత్తంగా ‘ఈనాడు’ వార్షికోత్సవంలో ప్రదర్శించి ప్రశంసలు పొందగలిగాం. విజయనగరం సమీపాన ఆండ్ర రిజర్వాయర్ నిర్మాణం పనులు ఆగిపోగా ప్రత్యేక కథనాలతో ఆ పనులు పూర్తి చేయడానికి దోహదపడ్డాం.

పార్వతీపురం సమీపాన ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో వివాదాస్పదంగా తయారైన జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రత్యేక కథనాలు ప్రచురించి సమస్యను పరిష్కరించగలిగాం. విశాఖ, విజయనగరం జిల్లాల మధ్య తాటిపూటి రిజర్వాయర్‌లో కేవలం స్వల్ప సాంకేతిక లోపం కారణంగా విశాఖ నగరానికి నీటి సరఫరా ఆగిపోగా, దానిపై ‘తాటిపూడి వెనుక నిర్లక్షపు సుడి’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించడంతో కలెక్టర్లు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. 1983 ప్రాంతంలో ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీ పేరుతో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పోలింగ్ ముందు రోజు ‘ఈనాడు’ సర్వే చేయించి ‘తెలుగు దేశం సూపర్‌హెట్’ అన్న శీర్షికతో ముందుగానే కర్టన్‌రైజర్ ప్రచురించింది. ఇది నిజంగా సాహసోపేతమైన చర్య. రామోజీరావు గారితో మూడు నెలల కోసారి ముఖాముఖి సమీక్షలు జరుగుతుండేవి. ఆ సమయంలో మా తప్పొప్పులపై చర్చించి సూచనలు చేసేవారు.

అదే విధంగా మా సూచనలను కూడా పరిగణన లోకి తీసుకునేవారు. ఒకసారి ఉషాకిరణ్ మూవీస్ సినిమాలపై చర్చ జరిగినప్పుడు పాటలు జనాలకు నచ్చడం లేదన్న నా విమర్శను ఆయన అంగీకరించి ఆ తరువాత కొన్ని సినిమాల పాటల రికార్డింగ్‌ను తానే స్వయంగా పర్యవేక్షించారు. టాబ్లాయిడ్‌ల్లో మేం పెట్టిన కొన్ని శీర్షికలు ఆయనకు నచ్చి ఈటివి ఛానెల్‌లో వినియోగించారు. దానికి ఉదాహరణ ‘రైతన్నలూ మీకిది తెలుసా!’, ‘ప్రతిధ్వని’, ‘సుఖీభవ’ శీర్షికలు. రామోజీరావు గారికి పాటలన్నా, కళాకారులన్నా చాలా మక్కువ. ఆయన తబలా వాయించేవారని చెబుతారు. నేను సందర్భానుసారంగా కొన్ని పాటలు రాసి ఆయన ముందు పాడేవాడిని.1988లో విజయవాడలో వంగవీటి మోహనరంగా హత్య జరిగినప్పుడు విజయవాడలో విధ్వంసం జరిగింది. ఆ సమయంలో కొంతమంది ప్రముఖుల కమిటీ విజయవాడలో పర్యటించగా, అందులోరామోజీ కూడా ఉన్నారు.

ఆ సమయంలో నేను ‘కుమ్ములాడుకోవద్దు తమ్ముడూ’ అన్నశీర్షికతో పాట రాసి ఆయనకు వినిపించాను.‘ బస్సుల్ని తగలేస్తే ప్రతీకారమాగుతుందా…బజారుల్ని కొల్లగొడితే ప్రయోజనముంటుందా! భవనాలను పడగొడితే బలం మనకు పెరుగుతుందా!.. బంద్‌లంటూ గొడవ చేస్తే పరిష్కారముంటుందా !’ అన్న వాక్యాలను ఆయన మెచ్చుకున్నారు. అలాగే 1993లో ‘ఈనాడు’ వార్షికోత్సవం సందర్భంగా ‘ఎక్కాలి ఎన్నెన్నో మెట్లు ’ అని పాట వినిపించాను, అందులో ‘ఆంధ్రావని గర్వపడే ఆశయాల ధీశాలి, అలుపన్నది అసలెరుగని అవిశ్రాంత శ్రమజీవి, అసాధ్యమే ఎరుగనట్టి అమోఘమౌ మేథావి, అధినేతగ ‘ఈనాడు’ కు వర్థిల్లెను రామోజీ’ అన్నవాక్యాలను ఆయన ఒప్పుకోలేదు. అసాధారణ ప్రజ్ఞావంతుడైనప్పటికీ, ఒక సామాన్యునిలా మాతో ఒక కుటుంబ సభ్యునిలా కలసిమెలసి సాగడం మరుపురాని అనుభూతి. వచ్చే 2024 ఆగస్టు నాటికి ‘ఈనాడు’ అవతరించి అర్ధశతాబ్దం అవుతుంది. ఈలోగా చైతన్య స్వరూపులైన ‘ఈనాడు’ ఛైర్మన్ రామోజీ అస్తమించడం తీరని లోటు అనిపిస్తోంది.

పి. వెంకటేశం
9985725591

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News