హైదరాబాద్: తన భర్త రాము ఇచ్చిన స్ఫూర్తితోనే అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు. రాము 17 ఏళ్ల వయసులోనే ఉద్యమబాట పట్టి, పలు కీలక పోరాటాల్లో కీలక భూమి పోషించారని కొనియాడారు. ఆయన నేర్పిన విలువలు, నైతికతతోనే పేదల అభ్యున్నతి కోసం పని చేస్తున్నానని వివరించారు. ఉద్యమాలపై రాము పాడిన పాటలను సీతక్క ఆవిష్కరించారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో జరిగిన కామ్రేడ్ కుంజ రాము వర్థంతి సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. భర్త కుంజ రాము వర్థంతి కార్యక్రమంలో ఆయనను గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా మంత్రి సీతక్క భావోద్వేనికి లోనయ్యారు. కన్నీంటి పర్యంతమైన సీతక్కను విమలక్క ఓదార్చారు. తాను ఉద్యమంలో పని చేస్తున్నప్పుడు త్రుటిలో ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ జీవితం బోనస్ అని, పునర్జన్మలో ప్రజలకు సేవల చేయాలనే సంకల్పంతోనే ప్రజా జీవితాన్ని కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. పేదల, ఆదివాసీ అట్టడుగు వర్గాల హక్కుల రక్షణ కోసం తుది శ్వాస వరకు పోరాడుతానని ఆమె తెలిపారు.