Tuesday, December 24, 2024

పరమ పవిత్రం రంజాన్ మాసం

- Advertisement -
- Advertisement -

పవిత్ర రంజాన్ మాసంలో అంతటా సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుంది. ఎటు చూసినా భక్తి సామరస్యం తొణికిసలాడుతూ ఉంటాయి. పవిత్రమైన ఈ మాసంలో ముస్లింలు పూర్తిగా అల్లాహ్‌కు అంకితమైపోతారు. పుణ్యకార్యాలలో నిమగ్నం అయిపోతారు. దివ్య ఖుర్‌ఆన్ అవతరించిన నెల కాబట్టి ఈ నెలలో ఖురాన్ పారాయణం చేయడం, ఉపవాస దీక్షలో అల్లాహ్ నామాన్ని జపిస్తూ ఉంటారు. ఉపవాసాన్ని ఎంతో నిబద్ధతతో, నియమాలతో ఆచరిస్తారు. అల్లాహ్‌కు ప్రీతికరమైన ఈ నెలలో ముస్లింలు కేవలం దేవున్ని ధ్యానిస్తూ పుణ్యకార్యాలకే పరిమితమవుతారు. దానధర్మాలు, నమాజులు చేస్తూ ఖురాన్ పఠిస్తూ ఎంతో నిష్ఠగా ఉంటారు. ఈ నెల రోజుల్లో పేదలకు సాయం చేయాలని చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ అల్లాకి ప్రార్థనలు చేస్తూ కఠిన ఉపవాస దీక్షలతో రంజాన్ నెల జరుపుకుంటారు. రంజాన్ పండుగ మానవాళికి హితాన్ని అందిస్తుంది.ముస్లింలు చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్ పండుగ జరుపుకుంటారు. ముస్లింలు చంద్రమానాన్ని అనుసరించి పండుగ జరుపుకోవడానికి గల కారణం ఆ మాసంలో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిష్కరించబడింది. ఈ నెలలో రంజాన్ పండుగకు ప్రాముఖ్యం ఏర్పడింది.

ఖురాన్‌లో రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం అని చెబుతోంది. ముస్లింలు అంతా నెల మొత్తం కఠినమైన ఉపవాసం (రోజా) చేస్తారు. ప్రతి రోజు సూర్యోదయానికి ముందు తిని రోజంతా ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విరమిస్తారు. మంచి పనులతో అల్లాను మెప్పించేందుకు ప్రయత్నిస్తారు.ఎలాంటి చెడు తలపులూ మనసులోకి కూడా రానివ్వకూడదని నమ్ముతారు. కల్మా తయ్యిబా చదవటం, పాపాల గురించి పశ్చాత్తాపం, స్వర్గప్రాప్తి కావాలనే కోరిక, నరకాగ్ని నుంచి కాపాడమనే విన్నపం చేస్తూ అల్లాను వేడుకుంటారు. ఈ పవిత్ర మాసంలో బీదసాదలకు దానం చేస్తుంటారు. నోటితో అశ్లీలం పలకరు, అబద్ధమాడరు. ఎవరైనా జగడానికి దిగితే నేను ఉపవాసం ఉన్నానని తప్పుకుంటారు. ఎవరిపై అపవాదులు, అభాండాలు మోపరు. అసూయకు, మోసానికి, అక్రమ సంపాదనకు దూరంగా ఉంటారు. ముస్లింలు ఉపవాస సమయంలో ఎలాంటి పరిస్థితులలో కూడా చెడు మాటలు పలకకూడదు. చెడు మాటలను వినకూడదు. ఉపవాసం చేసేవారు వారి దృష్టి మొత్తం ఆ భగవంతుడుపై ఉంచాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలో కూడా తమ దృష్టిని చెడువైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటిస్తారు. ఉపవాసం చేసేవారు తన శరీర భాగాలను చెడు పనుల నుంచి దూరంగా ఉంచుకోవాలి.

అలాగే అక్రమంగా సంపాదించి ఆ డబ్బుతో ఇఫ్తార్ విందు ఇవ్వకూడదనే కఠిన నియమం ఉంది. అబద్ధాలు చెప్పడం, చాడీలు చెప్పడం, అనవసర కబుర్లతో కాలయాపన, నోటి దురుసు లాంటివీ ఉపవాస స్ఫూర్తికి విరుద్ధం అని ఖురాన్‌లో రాసి ఉంది. పరోక్ష నింద వల్ల ఉపవాసం భంగం కలుగుతోంది. ఉదయం సూర్యోదయం కన్నా ముందే ఏదైనా తినాలి. ఆ తర్వాత సూర్యుడు ఉన్న సమయంలో నోటిలో వచ్చే ఉము కూడా మింగకూడదు. అంతా పవిత్రంగా ఉపవాస దీక్షను ఆచరిస్తారు.
రంజాన్ మాసంలో ముస్లింలు ముఖ్యంగా జకాత్ అని పేదవారికి చెల్లిస్తారు. జకాత్ అంటే పవిత్రత, రంజాన్ మాసంలో ఉపవాసలతో పాటు జకాత్ చెల్లించడం తప్పనిసరి. ధనికుడు పవిత్రుడు అయ్యేందుకు ఏడాదికి ఒకసారి అతని సంపద నుంచి రెండున్నర శాతం చొప్పున పేదలకు దానంగా అందిస్తారు. రంజాన్‌లో పేదోడు, ధనికుడు అనే వ్యత్యాసం లేకుండా రంజాన్‌ను పవిత్రంగా జరుపుకుంటారు. ధనం, బంగారం, వస్తువులు ఇవ్వడాన్ని జకాత్ అంటారు.ధనంలో నూటికి రెండున్నర రూపాయల చొప్పున ‘జకాత్’ ప్రతి సంవత్సరం చెల్లించాలి. అలా చేస్తే పుణ్యం వస్తోందని.. పేదలకు సాయం చేయాలని ఖురాన్ తెలపుతోంది. జకాత్‌తో పాటు ఫిత్రా దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.

మూడు పూటలా తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు, అభాగ్యులకు, పండగ సందర్భంలో దానం చేయాలని, ఇస్లాం మతం బోధిస్తోంది. ఫిత్రా దానం అని పిలుస్తారు. ఉపవాస వ్రతాలు విజయవంతం కావడానికి, దేవుని పట్ల కృతజ్ఞతగా, పేదలకు ఫిత్రా దానం చేయడం సదాచారం. రంజాన్ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులో, ఆత్మీయ స్వభావాలు ప్రస్ఫుటం అయితాయి. సామూహిక జీవన విధానానికి, విశాల ఆలోచన దృక్పథానికి ఇఫ్తార్ విందులు నిదర్శనాలు. పవిత్ర ఆరాధనలకు, ధార్మిక చింతనకు, దైవభక్తికి, క్రమశిక్షణకు, ఇంద్రియ నిగ్రహమునకు, స్వీయ నియంత్రణకు, దాతృత్వానికి ఆలవాలమైన రంజాన్ మాసం మనిషి సత్పప్రవర్తన దిశలో సాగడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. మానవుడిలో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్య పరాయణత్వం, సహనం, ధాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయ మార్గానుసరణం, ఆర్థిక సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం మొదలైన ఉత్తమ గుణాలు అలవాటు చేసేందుకు సర్వశక్తి, సర్వవ్యాప్తి, సర్వసాక్షి అయిన అల్లాహ్ రంజాన్ మాసాన్ని ప్రసాదించాడని విశ్వసిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News