పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపధ్యంలో హీరో రానాతో ఇంటర్వూ…
చాలా యదార్థంగా తీశాం…
అడవులకూ నాకూ ఏదో అనుబంధం ఉన్నట్లుంది. గత నాలుగేళ్ళుగా అడవుల్లోనే ఎక్కువ షూటింగులు జరిగాయి. ‘అరణ్య’ చిత్రం నుండి ‘విరాటపర్వం’ వరకు అడవుల్లోనే ఎక్కువ గడిపాను. ‘విరాట పర్వం’ 90లో జరిగే కథ. దళం సభ్యులు అడవుల్లో వుండే రోజులు, నాటి వాతావరణం.. చాలా యదార్థంగా తీశాం.
ఇంత భారం ఎప్పుడు తీసుకోలేదు…
నా కెరీర్‌లో ఫస్ట్ టైం ఒక గ్రేట్ లవ్ స్టొరీ చేశాను. చాలా లోతైన ప్రేమకథ ఇది. ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎంత దూరం వెళ్తాడు, ఎంత త్యాగం చేస్తాడు? స్క్రిప్ట్ చదివినప్పుడే చాలా లోతుగా అనిపించింది. కథ చదివినప్పుడు చాలా బరువనిపించింది. ఒక లోతైన సముద్రంలో తోసేస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ‘విరాటపర్వం’ కథ చదివినప్పుడు అలాంటి డీప్ ఫీలింగ్ కలిగింది. ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు, ఇంత భారం ఎప్పుడు తీసుకోలేదు.
అలాంటి నాయకుల స్ఫూర్తితో…
నేను చేసిన రవన్న పాత్ర యదార్థ పాత్ర కాదు. మేము డిజైన్ చేశాం. చేగువేరా లాంటి నాయకుల స్ఫూర్తి రవన్న పాత్రలో కనిపిస్తుంది. రవన్న ఒక డాక్టర్. కానీ అప్పుడున్న పరిస్థితులు రవన్నని కవిగా తర్వాత ఉద్యమ నాయకుడిగా మారుస్తాయి.
మోరల్ డైలమా గురించి…
ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేకుండా వెళ్తున్న రవన్న జీవితంలోకి వెన్నెల ప్రవేశిస్తుంది. ఇక్కడే ఒక మోరల్ డైలమా వుంటుంది. ఒక లక్ష్యం కోసం పని చేయాలా? ఫ్యామిలీతో కలసి రిలాక్స్ కావాలా? అనేది ఒక మోరల్ డైలమా. ఈ సినిమా మోరల్ డైలమా గురించి వుంటుంది. సరదాగా పాటలు పాడుకునే ప్రేమ కాదిది. రవన్న పాత్ర చాలా ఇంటెన్స్‌గా వుంటుంది. బలమైన ఎమోషన్స్ వుంటాయి. మహా భారతంలో విరాటపర్వం అనేది అజ్ఞాతవాసానికి సంబంధించిన కథ. ‘విరాట పర్వం’లో కూడా ఇలాంటి అజ్ఞాత పోరాటం వుంటుంది.
ఇది మహిళా చిత్రం…
సాయి పల్లవి గొప్ప నటి. ‘విరాట పర్వం’లో వెన్నెల పాత్ర మరో స్థాయిలో ఉంటుంది. ఇది వెన్నెల కథని ట్రైలర్‌లో చెప్పాం. రవన్న పాత్రని మరొకరు చేస్తారో లేదో తెలీదు కానీ వెన్నెల పాత్రని సాయి పల్లవి తప్పితే మరొకరు చేయలేరు. రవన్న, వెన్నెల కాకుండా ఈ సినిమాలో కనిపించే దాదాపు అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంది. జరీనా వాహెబ్, ప్రియమణి, ఈశ్వరి రావు, నందిత దాస్.. ఈ పాత్రలన్నీ బలంగా వుంటాయి. ఇది మహిళా చిత్రం.
Rana Daggubati interview about Virata Parvam