సుప్రీం , ప్రధాని మౌనం ఎందుకు?
తక్షణ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ : అయోధ్యలో స్థలాల కొనుగోళ్లలో మరో స్కామ్ జరిగిందని, దీనిపై నిజాల నిగ్గు తేల్చడం ద్వారా ప్రధాని, సుప్రీంకోర్టు తమ బాధ్యతను నిర్వర్తించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయోధ్యలో తక్కువ ధరల భూములను రామాలయ నిర్మాణ ధర్మకర్తల మండలి అత్యధిక ధరలకు కొనుగోలు చేస్తోందని, ఇటువంటి ఉదంతం రెండోసారి కూడా స్పష్టం అయిందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. న్యాయస్థాన పర్యవేక్షణతో కూడిన దర్యాప్తునకు వెంటనే ప్రధాని కానీ, సుప్రీంకోర్టు కానీ ఆదేశించాల్సి ఉందన్నారు. తాజాగా జరిగిన ఉదంతంలో బిజెపి నేత ఒకరు 890 గజాల స్థలాన్ని ఫిబ్రవరిలోనే అయోధ్యలోనే రూ 20 లక్షలకు కొనుక్కున్నారు. దీనిని కేవలం 79 రోజుల వ్యవధిలోనే ఈ బిజెపి నేత ట్రస్టుకు అత్యధిక ధర రూ 2.5 కోట్లకు విక్రయించాడు. ఈ వ్యవహారంలో బిజెపి నేతకు 1250 శాతం మేర లాభం దక్కిందని సూర్జేవాలా ఆరోపించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణ బాధ్యతల పర్యవేక్షణకు ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారని, ఈ దశలో రాముడి పేరు చెప్పి వసూలు చేసిన భారీ సొమ్మును ఈ విధంగా లూఠీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇటువంటి మోసపూరిత చేష్టలు అనేకం జరుగుతున్నాయని, వీటిపై ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు మౌనం దేనికి సంకేతం అని కాంగ్రెస్ ప్రశ్నించింది. అయోధ్యలో భూ కుంభకోణాల గురించి పత్రికలలో వార్తలు వెలువడుతున్నాయి. పవిత్ర స్థల నిర్మాణ వ్యవహారంలో ఇంత భారీ స్థాయిలో కోట్లాది రూపాయిలు చేతులు మారుతున్నాయి. కొందరి ఖాతాలలోకి పోతున్నాయి. ఈ అంశాలపై సుప్రీంకోర్టు తనంతతానుగా స్పందించి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని కాంగ్రెస్ ప్రతినిధి ప్రశ్నించారు. ట్రస్టు ప్రముఖుడు ఒకరు అయోధ్యలో ఓ స్థలాన్ని రెండు కోట్లకు కొనుగోలు చేసి , నిమిషాల వ్యవధిలోనే ట్రస్టుకు దీనిని ఏకంగా పద్దెనిమిదిన్నర కోట్లకు కట్టబెట్టారని భూ లావాదేవీల పత్రాలతో వెల్లడైందని కాంగ్రెస్ ఇటీవలే ఆరోపించింది.