Monday, December 23, 2024

అవినీతిపై కొరడా

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డి అవినీతి నిరోధకశాఖ అధికారులు పన్నిన వలలో చిక్కారు. ధరణిలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు బాధితుడు ముత్యంరెడ్డి అనే వ్యక్తి నుండి రూ.8 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వారిని పట్టుకున్నారు. సంచలన రేపిన ఈ ఘటనకు సంబంధించి ఎసిబి అధికారులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముత్యంరెడ్డి అనే వ్యక్తి తనకున్న 14 గుంటల భూమిని ధరణి వెబ్‌సైట్‌లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి తొలగించాలని కోరాడు. అందుకుగాను సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డి ఎనిమిది లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో సదరు బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఓఆర్‌ఆర్ పరిధిలో బాధితుడు ముత్యంరెడ్డి నుండి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు నగదును లంచంగా తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రంగప్రవేశం చేశారు.

లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ప్రోద్భలంతోనే తాను లంచం డిమాండ్ చేసినట్లు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డి ఎసిబి అధికారులకు తెలిపాడు. ఎసిబి అధికారులు సీనియర్ అసిస్టెంట్ ఫోన్ నుండి అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డికి ఫోన్ చేయించి అతనితో మాట్లాడించారు. దీంతో పెద్దఅంబర్‌పేట్ అవుటర్ రింగ్‌రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని అడిషనల్ కలెక్టర్ ..సీనియర్ అసిస్టెంట్‌కు తెలిపాడు. ఫోన్ సంభాషణలను విన్న ఎసిబి అధికారులు అత్యంత చాకచక్యంగా అక్కడికి చేరుకుని అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డి డబ్బులు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సినీపక్కీలో నిందితులను అదుపులోకి తీసుకున్న ఎసిబి అధికారులు వారి వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కాగా సోమవారం రాత్రి నుండి అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి నివాసం వద్ద ఎసిబి అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఎసిబి సిటీ రేంజ్ 1 డిఎస్‌పి శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు జానకిరామ్ రెడ్డి, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News