భగీరథమ్మ, తౌతానికుంటలో
అధికారులతో విచారించాం
సమావేశం నిర్వహించి,
నోటీసులిచ్చాం ముందస్తు
సమయమిచ్చినా స్పందించలేదు
హైడ్రా కమిషనర్ రంగనాథ్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నీటి వనరులు, ప్రభుత్వ భూములను రక్షించడాని కి హైడ్రా కట్టుబడి ఉంది, దాని ప్రయత్నాలలో చట్టాన్ని అనుసరిస్తూనే భగీరథమ్మ, తౌతానికుంట చెరువులోని ఆక్రమణలపై చర్యలు తీసుకొన్నదంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ మేరకు కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలోని వివరాలు ఈ విధం గా ఉన్నాయి.. కొందరు అక్రమార్కులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం తో ప్రచారం చేస్తున్నారని హైడ్రా ఆరోపించింది. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని భగీరథమ్మ, తౌటాని కుంట చెరువుల్లో ఏళ్ల తరబడిగా సాగుతున్న ఆక్రమణలను తొలగించడంలో అధికారులు విఫలమయ్యారని, ఆ ఆక్రమణలకు అడ్డుకట్ట వే యకపోతో ఆ ప్రాంతం పదేపదే ముంపునకు గురవుతూనే ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు.
స్థానిక వాణిజ్య దుకాణాల యజమానులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, శిఖం పట్టేదార్లతో ఇటీవల జరిగిన సమావేశంతో పాటు అనేకసార్లు హెచ్చరికలు, నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆక్రమణదారులు చెరువు భూమిని ఖాళీ చేయలేదనీ, అధికారులు కూడా ఖాళీ చేయించడంలో విఫలమయ్యారని హైడ్రా గుర్తించి చర్యలకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. భగీరథమ్మ చెరువు, తౌతానికుంటలో కూల్చివేతలు జీహెచ్‌ఎంసి చట్టంలోని సెక్షన్ 405ప్రకారమే చేశామని తెలిపారు.బుల్డోజర్ న్యాయం’పై ఇటీవల ‘సుప్రీం కోర్టు’ తీర్పుతో సహా చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించే హైడ్రా కూల్చివేతలు చేపట్టినట్టు వెల్లడించింది. అధికారిక నోటీసులు అవసరం లేనప్పటికీ, హైడ్రా నోటీసును జారీ చేసిందని రంగనాథ్ వివరించారు.
అధికారులు విచారించాకే..
శేరిలింగంపల్లి జోన్ పరిధి, మండలంలోని ఖాజాగూడ – నానక్ రామ్ గూడ ప్రధాన రోడ్డుకు ఇరువైపుల ఉన్న తౌతాని కుంట,, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతో పరిసర ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తుతోందని స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు. తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణల తొలగింపు విషయంలో వస్తున్న విమర్శలకు రంగనాథ్ బుధవారం వాస్తవాలను వివరించారు. ఫిర్యాదుల పరిశీలనకు జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు చెందిన అధికారులు వారిని విచారించినట్టు కమిషనర్ తెలిపారు. తౌటొనికుంట, భగీరతమ్మ చెరువులకు ఎనిమిదేండ్ల క్రితమే ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లను గుర్తించడానికి ఫ్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్స్ ఇచ్చినట్టు హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు. గత 28డిసెంబర్ 2024న బుద్ధభవన్ లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో వాణిజ్యదుకాణాల ఓనర్లు, రియల్ ఎస్టేట్ డవలపర్స్, శిఖం పట్టదార్లతో సమావేశం ఏర్పాటు చేసిన హైడ్రా ఈ సమావేశంలో ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్ సరిహద్దులను స్పష్టంగా పేర్కొంటూ తౌతాని కుంట, భగీరథమ్మ చెరువులో జరిగిన ఆక్రమణలపై స్క్రీన్ మీద గూగుల్ ఎర్త్‌లో స్పష్టంగా హైడ్రా అధికారులు వివరించారనీ రంగనాథ్ స్పష్టంచేశారు.
రాయదుర్గం పిఎస్‌లో కేసు నమోదు..
ఏస్ కార్పొ గ్రూపు ఈ మధ్యకాలంలో శిఖం పట్టాదారుడు మేకల అంజయ్య, ఇతరుల నుంచి 7ఎకరాల భూమిని తీసుకుని నిర్మాణాలు చేపట్టడంతోనే హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని కమిషనర్ పేర్కొన్నారు. సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ సైతం హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హజరయ్యారని రంగనాథ్ గుర్తుచేశారు. అయినా కూల్చివేతలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారని ఆయన తెలిపారు. భగీరథమ్మ చెరువులో మట్టిపోసిన సంధ్య కన్ స్ట్రక్షన్ ఓనర్ శ్రీధర్ రావుపై రాయదుర్గం పోలీసు స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదుచేసినట్టు రంగనాథ్ తెలిపారు. వైన్ షాపు తొలగించకుండా ఇతర షాపులను తొలగించారని వస్తున్న ఆరోపణల్లో ఏలాంటి వాస్తవంలేదని ఆయన స్పష్టంచేశారు. వైన్ షాపుకు ప్రభుత్వం లైసెన్స్ జారీచేసిందని, ఈ షాపు వేరే ప్రాంతానికి మార్చాలని ఎక్సైజ్ శాఖను కోరినట్టు రంగనాథ్ వెల్లడించారు. వైన్ షాపుకు అనుబంధంగా షాపులను సైతం తొలగించామని ఆయన వివరించారు. శిఖం పట్టాదారులు మేకల అంజయ్యతో పాటు ఇతరులు చెరువు బఫర్ జోన్‌లో దుకాణాలు నడుపుతున్నారని, నిర్మాణ శిధిలాలతో చెరువును నింపడంతో పాటు రియల్ ఎస్టేట్ కంపెనీలతో వారు అభివృద్ధి ఒప్పందం కూడా చేసుకున్నారని కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. ఇలాంటి విధానాలతో చెరువుల ఆక్రమణదారులందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ పేర్కొన్నారు.
జిహెచ్‌ఎంసి చట్టం ప్రకారమే..
చర్యలకు వారం రోజుల ముందుగానే సమావేశాలు నిర్వహించి, 3-4 రోజుల తర్వాత చెరువుల్లోని ఆక్రమణలను కూల్చివేస్తామని ముందుగానే హైడ్రా హెచ్చరించిందని, ఎఫ్‌టిఎల్/ బఫర్ జోన్‌లోని స్థలాలను ఖాళీ చేయమని కూడా హైడ్రా చెప్పిందని కమిషనర్ తెలిపారు. హైడ్రా నోటీసులు, సమావేశాలు నిర్వహించి హెచ్చరించిన తర్వాత కూడా ఎవరూ చెరువు స్థలాలను/ ఆక్రమణలను ఖాళీ చేయలేదని, డిసెంబరు 30న వారికి ఖాళీ చేయడానికి 24 గంటల సమయం ఇస్తూ మళ్లీ రాతపూర్వక నోటీసులు అందజేసినట్టు రంగనాథ్ తెలిపారు. ఎవరూ ఖాళీ చూయకపోవడంతోనే 31 డిసెంబర్ 2024న భగీరథమ్మ చెరువు, తౌతానికుంటలో ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌ను ఆక్రమణలను హైడ్రా తొలగించినట్టు కమిషనర్ రంగనాథ్ తెలిపారు జీహెచ్‌ఎంసీ చట్టం సెక్షన్ 405ప్రకారం వాటర్‌బాడీస్‌లో నిర్మాణాలు వచ్చినట్లయితే నోటీసు జారీ చేయవలసిన అవసరం లేదని కూడా రంగనాథ్ తేల్చేశారు.