Monday, December 23, 2024

దళిత భక్తుణ్ణి భుజానికెత్తుకున్న రంగరాజన్

- Advertisement -
- Advertisement -

Rangarajan carrying shoulder of Dalit devotee

మన తెలంగాణ/హైదరాబాద్: ఒక దళిత భక్తుణ్ణి భుజాలపైన ఎక్కించుకుని చిలుకూరి బాలాజీ ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లిన మునివాహన సేవతో ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు సాధించి, నోబెల్ గ్రహీత దలైలామా ప్రశంసలందుకున్నారు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీఎస్ రంగరాజన్. ఈ సందర్భంగా మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ, దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా వస్తున్న ఆచారమంటూ ‘మునివాహన సేవ’ గురించి వివరించారు. గత ఏడాది అయ్యప్పస్వామి పడిపూజలో, ఒక దళితుడు తన దగ్గరకు వచ్చి తమ వంట వేరేగా వండుకోమని తన గురుస్వామి చెప్తున్నారని మొరపెట్టుకోగా, తాను ఆ గురు స్వామిని మందలించి శ్రీవైష్ణవ సాంప్రదాయం గురించి విపులంగా వివరించానన్నారు.

నోబెల్ గ్రహీత దలైలామా కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిన రోజుని తానెప్పటికీ మరచిపోలేనన్నారు రంగరాజన్. ఆయన మాట్లాడిన కొద్దిసేపటికే మీరు చేసిన పని ఆదర్శనీయం. సదా ఆచరణీయం. దేవుడి ముందు అందరూ సమానమేనని సోదాహరణంగా వివరించారు అనే ఒక సందేశం పంపించారని, ఇది ఎంతో నమ్మకాన్నిచ్చిందని ఆయన అన్నారు. ముని వాహన సేవ ఈ ఒక్క ఆలయ ప్రవేశంతో ఆగిపోదని, రెండు తెలుగురాష్ట్రాల్లోనూ పల్లె నుంచి పట్టణం దాకా ఓ ఉద్యమంలా దీన్ని నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ప్రముఖ రచయిత కొలకలూరు ఇనాక్, కవి గోరటి వెంకన్న ఫోన్ చేసి అభినందనల్లో ముంచెత్తారన్నారు. తన బాల్య జ్ఞాపకాలన్నింటా చిలుకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాలే పచ్చగా పరుచుకుని ఉంటాయన్నారు. గతంలో మద్రాస్‌లో చీఫ్ ఇంజినీర్‌గా లక్షలు జీతం తీసుకుంటున్నా, మనసు మాత్రం చిలుకూరు బాలాజీ మీదే ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.

తరతరాలుగా వస్తున్న అర్చకవృత్తిని చూస్తూనే ఆయన తండ్రి సౌందర్‌రాజన్ ఉన్నత చదువులు చదివారని తెలిపారు. కామర్స్ లెక్చరర్‌గా మొదలుపెట్టి ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ స్థాయికి సౌందర్‌రాజన్ ఎదిగారని చెప్పారు. తన చదువంతా క్రైస్తవ మిషనరీ పాఠశాలలోనే జరిగినా గానీ, బడికి నిలువుగా వైష్ణవ నామాలు పెట్టుకునేవెళ్లే వాడినని, ఉపాధ్యాయులు తన చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకునేవారన్నారు. అంతేకాకుండా అక్కడి యేసు క్రీస్తు ప్రార్థనా గీతాలు కూడా అలవోకగా పాడేవాణ్ణని తెలిపారు. క్రైస్తవ పాఠశాల అయినా గానీ, ఆయన వైష్ణవ బ్రాహ్మణ సాంప్రదాయ విషయంలో ఎవ్వరూ కూడా ఆక్షేపించలేదని పేర్కొన్నారు. ఈ విధమైన పరమత సహనమే ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని సీఎస్ రంగరాజన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News