Wednesday, January 22, 2025

కాంగ్రెస్ పాలనలో మహిళలపై పెరిగిన దాడులు: రాణి రుద్రమ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః గత పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన బిజెపి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రత్యామ్నాయ వాతావరణం తీసుకువచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, ప్రజా తీర్పును తాము ఆమోదించినట్లు తెలిపారు. గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజామోదయోగ్యమైన పాలనలో ఇప్పటికైనా ప్రజాస్వామ్యం నిలబడుతుందని కోరుకున్నామని, గత ప్రభుత్వంలో అప్రజాస్వామిక పాలన నడిచిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే తరహా పాలన నడుస్తోందని ఆరోపించారు. ధర్నా చౌక్ ను ఎత్తివేసి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను నొక్కేసిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హక్కుల కోసం పోరాడిన వారి గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. గత పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదనిపిస్తోందని, సిఎం రేవంత్ రెడ్డి గత పాలకులకు పదిరెట్లు దొరస్వామ్యం చూపెడుతున్నారని పేర్కొన్నారు.

వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నిరసన తెలిపిన విద్యార్థులకు మద్దతు తెలిపిన ఎబివిపి కార్యదర్శి ఝాన్సీపై పోలీసులు వ్యవరించిన తీరు సక్రమంగా లేదన్నారు. వ్యవసాయ యూనివర్సిటీ భూములను హై కోర్టుకు కేటాయించవద్దని విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు బాగుపడుతారని జయశంకర్ సార్ పేరుతో స్థాపించిన యూనివర్సిటీలో విద్యార్థులను చెల్లాచెదురు చేసి పోలీసులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. విద్యార్థినేత ఝూన్సీని జుట్టు పట్టుకుని లాక్కెళుతూ దాడికి పాల్పడటం దారుణమన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని, ఇదేనా కాంగ్రెస్ పరిపాలన తీరు ఎబివిపి నాయకురాలిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిన పోలీసులపై ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విద్యార్థి నాయకురాలపైనే పోలీసులు ఇలా వ్యవరిస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని, ప్రధాని మోదీ పాలనలో భారతదేశంలో త్రివిధ దళాల్లో మహిళా ప్రాతినిధ్యం కల్పించారని,

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జరిగే పరేడ్ లో మహిళా సిబ్బంది పాల్గొనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి గౌరవించిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ మహిళల పట్ల విచక్షణారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. క్రైమ్ రేటులో దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో ఉందని,మహిళలపై దాడులు, అరాచకాలకు కారణమవుతున్న బెల్ట్ షాపులను రద్దు చేయడమే కాకుండా ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యమాలు చేసే మహిళలపైనే దాడులు జరుగుతున్నాయంటే తెలంగాణలో పాలన దారుణంగా ఉందన్నారు. విద్యార్థి నేత ఝాన్సీపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకుని ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News