భారతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ అదానీతో మన్నార్‌లో పునరుపయోగ విద్యుత్ ప్రాజెక్టుపై ముందుకు సాగడంలో విఫలమైనందుకు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె ప్రభుత్వాన్ని మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె విమర్శించారు. శనివారం టివిలో ప్రసారం చేసిన చర్చ సమయంలో విక్రమసింఘె ఆ విమర్శ చేశారు. చర్చ పూర్తి పాఠాన్ని సోమవారం విడుదల చేశారు. ద్వీప దేశం శ్రీలంకకు గరిష్ఠ స్థాయిలో ఫలితాల సాధనకు భారత్‌తో ఆర్థిక సహకారాన్ని శ్రీలంక పెంపొందించుకోవలసిన అగత్యం ఉందని కూడా ఆయన ఉద్ఘాటించారు.
2022లో తన రెండు సంవత్సరాల పదవీ కాలంలో తాను పునరుపయోగ విద్యుత్, వ్యవసాయం రంగాలు, వాణిజ్య సంబంధాల్లో దక్షిణ భారత్‌పై దృష్టి కేంద్రీకరించి ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఆవశ్యకత గురించి నొక్కిచెప్పానని విక్రమసింఘె తెలియజేశారు. ‘భారత్‌తో ఆర్థిక సహకారం కోసం నేను పలు అవకాశాలను అన్వేషించాను. ప్రస్తుత ప్రభుత్వం మన్నార్‌లో అదానీ పునరుపయోగ విద్యుత్ ప్రాజెక్టుపై ముందుకు సాగడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన చెప్పారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు గురించి తిరిగి సంప్రదింపులు జరిపేందుకు ఎన్‌పిపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో హేతుబద్ధత లేదని విక్రమసింఘె అన్నారు.