Monday, December 23, 2024

అత్యవసర ఔషధాల జాబితానుంచి రనిటైడిన్ తొలగింపు

- Advertisement -
- Advertisement -

Ranitidine removed from Essential Medicines

కొత్తగా చేరిన 34 మందులు
తగ్గనున్న యాంటీ బయోటెక్స్, క్యాన్సర్ నిరోధక మందుల ధరలు
384 ఔషధాలతో నూతన జాబితాను విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్రప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. కొత్త జాబితాలో 384 ఔషధాలున్నాయి. ఇందులో ఐవర్‌మెక్టిన్ లాంటి యాంటి ఇన్ఫెక్టివ్‌లతో పాటుగా కొత్తగా 34 మందులను చేర్చారు. ఇక రనిటైడిన్ సహా 26 ఔషధాలను అత్యవసర మందుల జాబితానుంచి తొలగించారు. ప్రముఖ యాంటాసిడ్ అయిన రనిటైడిన్‌ను తొలగించడంతో ఇకపై జిన్‌టాక్స్, రాంటాక్ వంటి టాబ్లెట్లు అత్యవసర ఔషధాల జాబితాలో కనిపించవు. జాతీయ అత్యవసర ఔషధాల జాబితా 2022ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం విడుదల చేశారు. మొత్తం 27 కేటగిరీల్లో 384 మందులతో కొత్త జాబితా ఉన్నట్లు ఆయన తెలిపారు.ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీ బయోటెక్‌లు, వ్యాక్సిన్లు క్యాన్సర్ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు ప్రజల అందుబాటులోకి రానున్నాయని, రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని మాండవీయ చెప్పారు. ఎండోక్రైన్ మందులు, ఇన్సులిన్ గ్లార్గిన్, ఐవర్‌మెక్టిన్ లాంటి 34 రకాల మందులను జాబితాలో చేర్చారు.

అలాగే రనిటైడిన్,సక్రాల్‌ఫేట్, అటినోలాల్ వంటి 26 రకాల ఔషధాలను జాబితానుంచి తొలగించారు. మందుల ధరలు, ఉత్తమ ఔషధాల లభ్యత తదితర కారణాలతో మందులను జాబితానుంచి తొలగించినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది.2015 తర్వాత జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను అప్‌డేట్ చేయడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. 350 మందికి పైగా నిపుణులతో 140 సార్లు చర్చించడంతో పాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్లు హెచ్‌ఓ)కు చెందిన అత్యవసర ఔషధాల జాబితా 2021లాంటి పలు ముఖ్యమైన డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఈ జాబితాను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. ప్రముఖ యాంటాసిడ్ సాల్ట్ అయిన రనిటైడిన్ ఔషధాన్ని దేశంలో అసిలాక్, జిన్‌టాక్, రాంటాక్ వంటి బ్రాండ్లతో విక్రయిస్తున్నారు. ఎసిడిటీ, కడుపునొప్పి సంబంధిత సమస్యలకు వైద్యులు ఎక్కువగా ఈ మందులను సూచిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఔషధాల్లో ఇది ఒకటి. అయితే ఈ ఔషధంలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని 2019 అమెరికా పరిశోధన ఒకటి వెల్లడించింది. అప్పటినుంచి ఈ ఔషధ వినియోగంపై చర్చ జరుగుతోంది. బహుశా ఈ కారణం వల్లనే అత్యవసర మందుల జాబితానుంచి దీన్ని తొలగించి ఉండవచ్చని భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News