Tuesday, November 5, 2024

స్పైస్‌జెట్‌పై రాన్సమ్‌వేర్ ఎటాక్… వందలాది విమానాలు ఆలస్యం

- Advertisement -
- Advertisement -

Ransomware Attack on SpiceJet

న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థపై స్పైస్‌జెట్ పై రాన్సమ్‌వేర్ (ఒక రకమైన మాల్‌వేర్ ) దాడి జరిగింది. రాన్సమ్ వేర్ అనేది ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలిగించే ఒక రకమైన మాల్వేర్. సైబర్ నేరగాళ్లు అనుమతి లేకుండా సైట్లోకి ప్రవేశించి కీలక సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి లాక్ చేస్తారు. వాటిని డీక్రిప్ట్ చేసి అన్‌లాక్ చేయడానికి కొంత సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు. సంస్థ సర్వర్ నెమ్మదించడంతో బుధవారం ఉదయం బయలు దేరాల్సిన వందలాది విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. విమానాలు ఆలస్యంగా బయలు దేరాల్సి వచ్చింది. దీంతో వేర్వేరు ఎయిర్‌పోర్టుల్లో వేలాది మంది ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు నిర్ధారించారు. గుర్తు తెలియని దుండగుల సైబర్ దాడి వల్లనే ఇది జరిగిందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. మంగళవారం రాత్రి ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ ప్రభావంతో బుధవారం ఉదయం బయలుదేరాల్సిన విమానాలు ఆలస్యమయ్యాయని చెప్పారు.

ప్రస్తుతం సర్వీసులన్నీ సాధారణం గానే నడుస్తున్నాయని స్పష్టం చేశారు. పలు స్పైస్‌జెట్ సిస్టమ్స్ పై రాన్సమ్ వేర్ దాడి ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. తమ ఐటీ బృందం నిరంతరాయంగా పనిచేసి సమస్యలను సరిదిద్దిందని ట్విటర్ వేదికగా స్పైస్‌జెట్ బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో వెల్లడించింది. బుధవారం ఉదయం పలు ఎయిర్‌పోర్టుల వద్ద స్పైస్‌జెట్ ప్రయాణికులు పడిగాపులు కాశారు. ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో స్పందించిన స్పైస్‌జెట్ సిబ్బంది, సర్వర్ నెమ్మదించిందని వివరించారు. అయితే పలువురు కస్టమర్లు స్పైస్‌జెట్ సిబ్బందిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం తెలియజేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News