Saturday, March 15, 2025

10,15 సార్లు చెంపదెబ్బలు కొట్టారు:నటి రన్యారావు

- Advertisement -
- Advertisement -

బంగారం అక్రమరవాణా ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్న కన్నడ నటి రన్యారావు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారు తనను కొట్టారని, చెంపదెబ్బలు వేశారని, తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆమె ఆరోపించారు. దుబాయి నుంచి తాను వచ్చినప్పుడు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనను అరెస్టు చేసిన మూడు రోజుల తరువాత ఈ నెల6న డిఆర్‌ఐ అదనపు డైరెక్టర్ జనరల్‌కు ఆమె రాసిన లేఖలో ఆ ఆరోపణలు ఉన్నాయి. ఆమె తన శరీరంపై రూ. 12.56 కోట్లు విలువచేసే 14.2 కిలోల విదేశీ బంగారు కడ్డీలను రహస్యంగా దాచినట్లు డిఆర్‌ఐ అధికారులు ఆరోపించారు. ఆ సమయంలో నిర్బంధంలో ఉన్న బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో జైళ్ల చీఫ్ సూపరింటెండెంట్ కె సురేష ద్వారా డిఆర్‌ఐ సీనియర్ అధికారికి పంపిన ఆ లేఖ శనివారం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఆమె బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన మరునాడు లేఖ లీక్ అయింది. ఆమె ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

‘ఈ వ్యవహారంలో నేను అమాయకురాలినని వివరించేందుకు కూడా మీ అధికారి నన్ను అనుమతించలేదని మీకు తెలియజేయాలని ఆకాంక్షిస్తున్నాను. వారు నన్ను విమానం లోపల పట్టుకున్నారు, అప్పటి నుంచి నన్ను గౌరవనీయ న్యాయస్థానంలో హాజరు పరిచేంత వరకు అధికారులు నన్ను కొట్టారు, దాదాపు 1015 సార్లు నా ముఖంపై దెబ్బలు వేశారు. వారిని గుర్తు పట్టగలను’ అని రన్యారావు ఆ లేఖలో పేర్కొన్నారు. ‘నన్ను పదే పదే కొట్టినప్పటికీ, నా ముఖంపై దెబ్బలు వేసినప్పటికీ వారు సిద్ధం చేసిన ప్రకటనలపై సంతకం చేయడానికి నిరాకరించాను. ‘నువ్వు కాగితాలపై సంతకం చేయకపోతే మీ తండ్రి ప్రమేయం లేదని మాకు తెలిసినప్పటికీ ఆయన పేరును బహిర్గతం చేస్తాం’ అని అధికారుల్లో ఒకరు చెప్పారు. తీవ్ర ఒత్తిడి, నాపై భౌతిక దాడి కారణంగా టైప్ చేసిన దాదాపు 5060 కాగితాలపైన, సుమారు 40 తెల్ల కాగితాలపైన డిఆర్‌ఐ అధికారుల బలవంతంతో సంతకం చేశాను’ అని ఆమె తెలిపారు. రన్యా రావు సవతి తండ్రి పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) కె రామచంద్రరావు.

డిఆర్‌ఐ వాదన ప్రకారం, విమానాశ్రయంలో సోదాలు, తనిఖీలు తప్పించుకోవడానికి రన్యారావు వినియోగించుకున్న అనుమానిత ప్రొటోకాల్ ఉల్లంఘనకు ఆయనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. తనను సరిగ్గా నిద్ర పోనివ్వలేదని, భోజనం చేయనివ్వలేదని, అధికారులు ‘కావాలనే నాకు నిద్ర లేకుండా చేశారు’ అని కూడా నటి రన్యారావు ఆరోపించారు. తనపై దాడిని కోర్టు వెల్లడించిన పక్షంలో ఆమె డిజిపి సవతితండ్రి పేరును బహిర్గతం చేస్తామని తనను కోర్టుకు తీసుకువెళుతున్నప్పుడు ఈ నెల 4న డిఆర్‌ఐ అధికారులు కారులో బెదరించారని కూడా ఆమె ఆరోపించారు. అయితే, డిఆర్‌ఐ కోర్టుకు సమర్పించిన ఆమె ప్రకటనలు ఆమె ఆరోపణలకు భిన్నంగా ఉన్నాయి. తాను బంగారం అక్రమరవాణా చేసిన విషయాన్ని, తాను ఆ పని చేసిన తీరును ఆమె ఆ ప్రకటనల్లో ఒప్పుకున్నారు. కాగా, ఆమె అరెస్టు తరువాత కొన్ని రోజులకు లీక్ అయిన ఒక ఫోటోలో రన్యారావు కళ్ల చుట్లూ నల్ల వలయాలు ఉన్నట్లు కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News