న్యూఢిల్లీ: న్యాయస్థానం ఆదేశాల మేరకు లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జెపి) పార్లమెంట్ సభ్యుడు ప్రిన్స్ రాజ్‌పై అత్యాచార ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్‌జెపి మహిళా కార్యకర్త ఒకరు తనపై ప్రిన్స్ రాజ్ అత్యాచారానికి పాల్పడినట్లు మూడు నెలల క్రితం ఫిర్యాదు చేయగా న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా&ఎల్‌జెపి అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ ఎంపి ప్రిన్స్ రాజ్‌ను సమర్థించే ప్రయత్నం చేశారు. ప్రిన్స్ రాజ్‌ను అప్రతిష్ట పాల్జేసేందుకు జరిగిన రాజకీయ కుట్రగా ఈ ఆరోపణలను ఆయన అభివర్ణించారు. తనను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ తనపై ఆరోపణలు చేసిన మహిళపై ఫిబ్రవరి 10వ తేదీన ప్రిన్స్ రాజ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన వివరించారు. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమెపై 2020లో అత్యాచారం జరిగింది. సెప్టెంబర్ 9న కోర్టు ఆదేశాలు వచ్చాయని, దీని మేరకు కన్నాట్ ప్లేస్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బీహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రిన్స్ రాజ్ ఎల్‌జెపి నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌కు సోదరుడి వరుస అవుతారు.