‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’
అంటే స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని అర్థం. కాని నేటి సమాజం స్త్రీని ఒక ఆట వస్తువులాగా, పిల్లలను కనే ఒక యంత్రంలాగా వంట వండి పెట్టే ఒక సాధనం లాగా చూస్తున్నది. మన దేశంలో సినిమాలు, సీరియళ్లు, వ్యాపార, వాణిజ్య ప్రకటనలు మహిళలను (వస్తువులుగా పరిగణిస్తున్నాయి) అగౌరవపరుస్తూ, చూపిస్తూనే ఉన్నా యి. దీనితో పసికందు నుండి పండు ముసలి వరకు మహిళలపై లైంగిక అత్యాచారాలు నిత్యకృత్యంగా జరుగుతున్నాయి. ఆడ శిశువులను పొత్తిల్లో చంపేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీల పట్ల పురుషులు చూసే ఆలోచనా విధానంలో మార్పు రానంత వరకు స్త్రీల పట్ల నేరాలు పెరుగుతూనే ఉంటాయి. అందుకు దేశవ్యాప్తంగా ఎన్‌సిఆర్‌బి 2021 సంవత్సరంలో స్త్రీల పైన పెరిగిన దారుణాలు ఈ నెలలో ఎన్‌సిఆర్‌బి విడుదల చేసింది.
భారతదేశంలో 2021 సంవత్సరంలో మహిళలకు జరుగుతున్న నేరాలపై ప్రతి గంటకు 49 కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజు 86 మంది స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతున్నాయని ఎన్‌సిఆర్‌బి రిపోర్టు తెలిపింది. నాగరిక సమాజంలో ప్రతి సంవత్సరం మహిళల పైన జరుగుతున్న నేరాలు తగ్గాల్సింది పోగా పెరుగుతున్నాయి. 2021 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 4,28,278 మంది స్త్రీల పైన నేరాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. అందు లో (31,677 మంది పైన అత్యాచారం కేసులు) 2019లో 4,05,326 మంది స్త్రీల పైన నేరం జరిగినట్లుగా కేసు నమోదు అయ్యాయి. అందులో (32,033 మందిపైన అత్యాచారం కేసులు) 2020 లో 3,71,503 మంది స్త్రీల పైన కేసులు నమోదయ్యాయి. అందులో (28,046 మంది పైన అత్యాచారం కేసులు). (కరోనా మూలంగా నేరాలు తగ్గినట్లు భావించవచ్చు). దేశంలో కేసులు నమోదు కాని సంఘటనలు ఎక్కువగా ఉంటాయి.
అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు, కిడ్నాపు, యాసిడ్ దాడులు, వరకట్నపు వేధింపులు, ఆత్మహత్యలు ప్రేరేపించడం, బలవంతపు పెండ్లిలు, అక్రమ రవాణా, ఆన్‌లైన్ వేధింపు లాంటి నేరాలు స్త్రీల పైన నిత్యకృత్యంగా జరుగుతున్నాయి. సమాజంలో సగం, అవకాశాలలో (పేరుకు) మాత్రం 33 శాతం (విద్య, ఉద్యోగ, రాజకీయ) రాజకీయాలలో స్త్రీలు వార్డు మెంబర్ నుండి ఉన్నతమైన మంత్రి పదవులలో ఉన్నా ఎక్కువ శాతం పురుషులదే ఆధిపత్యం కొనసాగుతున్న నిజాన్ని ప్రతి రోజు మనం చూస్తూనే ఉన్నాము. అవకాశాలలో 33% రిజర్వేషన్ స్త్రీలకు కల్పిస్తున్న ఇంటి నుండి ఆఫీసుల వరకు పురుషాధిక్యం కనబడుతూనే ఉంది. కొంతమంది పురుషులు స్త్రీలను సొంత నిర్ణయాలు తీసుకొనివ్వరు. చాలా మంది పురుషులు స్త్రీలను నీవు అది చేయలేవులే, నీవల్ల కాదులే, అది నీవు చేయవలసిన పనికాదు అని ప్రతి సందర్భంలో స్త్రీలను కించపరుస్తూ మాట్లాడుతుంటారు.
దీనికి స్త్రీలు నిజమే అనుకొని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వెనుకడుగు వేస్తుంటారు. ‘ఈ విశ్వంలో సృష్టికి ప్రతి సృష్టి ఒక స్త్రీ మాత్రమే సృష్టించగలదు’.మహిళలకు మగవారి కంటే ఎక్కువ ఆత్మస్థైర్యం ఉంటుంది. 80 శాతం మహిళలు 20 నుంచి 28 సంవత్సరాల వయసులోపు భర్తను కోల్పోయిన కూడా కుటుంబాలను నడిపిస్తున్నారు. స్త్రీ అతి బలమైన శక్తి శాలి. ముఖ్యంగా పురుషులకు దీటుగా ప్రతి పని మహిళ చేయగలుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మహిళలది అద్వితీయమైన పాత్ర. ‘వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమో వ్యవసాయం నడవడానికి స్త్రీ కూడా అంతే ముఖ్యం’.
పురుషులు లేకుండా వ్యవసాయాన్ని చేస్తున్న మహిళా రైతులు ఎంతో మంది ఉన్నారు. కానీ స్త్రీ లేకుండా వ్యవసాయం చేస్తున్న రైతులు ఎవరూ లేరు? అది సాధ్యం కూడా కాదు. మహిళలు ఇంటిపని అంత చేసుకుంటూ మగవారితో సమానంగా బయట పని కూడా చేస్తారు. అంటే ప్రతి రోజు ఒక గృహిణి ఇంటి పని కోసం దాదాపు 12 కిలోమీటర్ల దూరం నడుస్తుందని ఒక అంచనా! వ్యవసాయములో పురుషుల కంటే మహిళలు 73.2% ఎక్కువగా పనులు చేస్తుంటారు. విత్తనాలు శుద్ధి నుండి మొదలుకొని, విత్తనాలు వేయడం, కలుపుతీయడం, రసాయనిక, పురుగు మందులు చల్లడం, పంట కోయడం, పంట అమ్మడం, పశువులను, గొర్రెలను, కాయడం, పాలు పిండడం, పౌల్ట్రీ ఫారం నడిపించడం మొదలైన పనులు చేయడం జరుగుతుంది. కానీ ఇంత పని చేసినా కూడా మహిళలకు సరైన గుర్తింపు లేకపోవడం చాలా దురదృష్టకరం. భూ యాజమాన్య హక్కులు (భూమి పట్టా) మాత్రం కేవలం 13 శాతం మంది మహిళలకు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
అది కూడా ఇంట్లో ఉండే మగ రైతులకు ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి పట్టా ఉంటే చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పొందడానికి అర్హులు కాదని మహిళలపై కొంత భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కాని స్త్రీల పేరు మీద భూమి హక్కులు ఉండాలనే ఉద్దేశంతో మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది. భూమి కేవలం జీవనాధారం కాదు సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయిని కూడా నిర్ణహిస్తుంది. భూయాజమాన్య హక్కులు లేక మహిళలు వివక్షకు గురి అవుతున్నారు. మహిళలు ఇంటి పని, పిల్లల పెంపకం ఇటు పురుషులతో సమానంగా బయట పని చేస్తున్న కూడా పనికి తగ్గ వేతనం పక్కకు పెట్టిన వారి పనికి గుర్తింపు ఇవ్వకపోవడం స్త్రీని గౌరవిస్తున్న తీరుకు నిదర్శనం. సృష్టి ప్రారంభమైన నాటి నుండి తన కన్న బిడ్డల, భర్త, కుటుంబం గురించి నేటికీ మరి ఎప్పటికైనా ఆలోచిస్తూ తన వారి కోసం అలుపెరుగని అద్భుతం ఎవరు చేస్తున్నారు అంటే ఒకే ఒక్కరు స్త్రీ.
భారతదేశంలో 15 నుండి 50 సంవత్సరాల వయసు లోపు మహిళలకు 51 శాతం రక్తహీనతతో, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అదే విధంగా 25 కోట్ల మంది భారతీయ మహిళలు రాత్రి పూట అన్నం ( అర్ధ ఆకలితో ) తినకుండా నిద్రపోతున్నారు. 156 దేశాల్లో అధ్యయనం చేసిన 2021 గ్లోబల్ జెండర్ గ్యాప్‌ను పరిశీలిస్తే భారతదేశం స్త్రీ పురుషుల సమానత్వంలో 140 వ స్థానంలో ఉంది. స్త్రీని దేవతగా చూడకున్న పరవాలేదు కానీ సాటి మనిషిగా చూసే సంస్కృతి రావాలి. ముఖ్యంగా స్త్రీల పట్ల పురుషులు చూసే ఆలోచనా విధానంలో మార్పు రావాలి.
పురుషులతో సమానంగా స్త్రీకి అవకాశాలు, సమాన కూలీ, సమాన ఆస్తి, సమాన గౌరవం కల్పించాలి. స్త్రీ ఔన్నత్యాన్ని, ప్రాముఖ్యతను వివరిస్తూ పాఠ్యపుస్తకాలలో పాఠాలు రావాలి. స్త్రీలపై జరుగుతున్న నేరాలకు కఠినమైన శిక్షలు విధించాలి. ఆ శిక్షలను ప్రచారం చేయాలి. అప్పుడే స్త్రీలపైన కొంతవరకు అత్యాచారాలు తగ్గుతాయి. స్త్రీ పురోగతే సమాజ అభ్యున్నతికి తోడ్పడుతుంది.
పులి రాజు
9908383567