చెన్నై : మహిళలు, బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, అత్యాచారం, అత్యాచార యత్నాలకు సంబంధించిన నేరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న శాసనసభలో ఆమోదించిన చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదం తెలిపారు. ఈ బిల్లు కంటే ముందు శాసన సభలో గతంలో ఆమోదించి పంపిన సుమారు పది బిల్లుల్ని మాత్ర పక్కన పెట్టి, ఈ బిల్లు మాత్రం అంగీకరించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం అమలు లోకి తెచ్చిన రెండు చట్టాలకు సంబంధించిన సవరణలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, అత్యాచార యత్నాలు, సామూహిక అత్యాచారాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో అమలు లోకి తెచ్చిన భారతీయ న్యాయసంహిత(బీఎన్‌ఎస్) , భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)చట్టాలను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సవరణ చేసి ముసాయిదా చట్టాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఈనెల 10న శాసనసభలో ప్రవేశ పెట్టారు.దీనికి గవర్నర్ ఆమోదం తెలిపినట్టు రాజ్‌భవన్ నుంచి ప్రకటన విడుదలైంది.
కొత్త చట్టం వివరాలు…
ఈ కొత్త చట్టం ప్రకారం బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష, 12 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణశిక్ష విధిస్తారు. 18 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష విధిస్తారు. అత్యాచార కేసుల్లో బాధిత మహిళల వివరాలను బహిర్గతం చేస్తే మూడేళ్లు, లేదా ఐదేళ్లు జైలుశిక్ష, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే మూడు నుంచి ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. యాసిడ్ దాడి వంటి కేసుల్లో పదేళ్ల జైలుశిక్ష విధిస్తారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో ఈ కొత్త చట్టం గురువారం నుండే రాష్ట్ర మంతటా అమలు లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష
- Advertisement -
- Advertisement -
- Advertisement -