Sunday, November 24, 2024

అబలలపై అత్యాచారాలు

- Advertisement -
- Advertisement -

25 year old man has raped Deaf and Dumb Girl

‘నిర్భయ’ల భయం వీడలేదు. ‘దిశ’ల దశ మారలేదు. ‘హత్రాస్’ హాహాకారాలు ఆగనేలేదు. ‘భాద్రస్’ బాలిక ఆత్మఘోష అరణ్య రోదనే అయ్యింది. ‘ఉన్నావ్’ చిన్నారి ఊపిరి ఆగిపోయింది. ‘సిరోహి’లో 8- ఏండ్ల గిరిజన బాలిక అత్యాచార హత్యోదంతం, ‘కతువా’లో 8- ఏండ్ల బాలికపై సామూహిక అత్యాచారం, ఉదయ్‌పూర్ యువతి వరుస అత్యాచార ఆక్రందనలు, ఆల్వర్‌లో 4 -ఏండ్ల చిన్నారిని 45 -ఏండ్ల మదుపుటేనుగు మానభంగం చేసిన దుర్మార్గం లాంటి దుర్ఘటనల జాబితాకు అంతం లేదు. నవంబర్- 2020లో దేవనహళ్లి, కర్నాటక దేవాలయ పూజారి 10- ఏండ్ల బాలికపై పాశవిక కామవాంఛ తీసుకోవడం మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో ఆకృత్యం వెలుగుచూడడం విచారకరం, ఖండనీయం.

2021, జనవరి 03వ తేదీన యుపిలోని ‘బదాయు’ జిల్లాలోని ఉగైతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామ దేవాలయం సాక్షిగా రాక్షస పూజారితో కలిసి ఇద్దరు భక్తుల ముసుగులో ఉన్న దున్నపోతులు 50- ఏండ్ల అంగన్‌వాడీ కార్యకర్తను సామూహిక అత్యాచారం చేసిన అనంతరం హత్య చేయడం నాగరిక సమాజాన్ని నివ్వెరపరిచింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో దేవాలయానికి వెళ్ళిన మహిళ 2-3 గంటల తరువాత కూడా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అదే రోజు రాత్రి 11:30 ప్రాంతం మానవ మృగాలు కొనఊపిరితో రక్తసిక్తమైన మహిళను, నీళ్ళులేని బావిలో పడి గాయాలపాలైందంటూ ఇంటి సమీపంలో వదిలి పారిపోయారు. క్షణాల్లో దీనురాలి ప్రాణాలు నిశీధిలో కలిసిపోయాయి. శవ పరీక్ష వివరాల ప్రకారం మహిళ శరీరం, మర్మావయవాలు తీవ్రగాయాలు కావడం, కాలు, పక్కటెముకలు విరగడం జరిగిందని వెల్లడయ్యింది. ఈ అమానవీయ దుర్ఘటనను ఖండిస్తూనే స్పందించిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి మాట్లాడుతూ మహిళ ఒంటరిగా రాత్రిపూట గుడికి వెళ్ళడమే నేరమంటూ, అభాగ్య మహిళపై తప్పును నెట్టే ప్రయత్నం చేయడం పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది.

దేశ వ్యాప్తంగా మహిళలపై మానవ మృగాల అత్యాచారాలు నిరాటంకంగా, నిర్భయంగా, నిస్సిగ్గుగా జరుగుతూనే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2019లో అఖండ భారతంలో రోజుకు సగటున 87 కేసులు, నిమిషానికి 16 రేప్‌లు, 30 గంటలకు ఒక సామూహిక అత్యాచార హత్య, గంటకు ఒక వరకట్న చావు జరుగుతున్నాయని తేలింది. 2019లో 4.06 లక్షల మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని తెలుస్తున్నది. ఇండియాలో జరుగుతున్న అత్యాచారాల సంఖ్యలో యుపీ ప్రథమ స్థానంలో (59,853; 14.7 శాతం కేసులు) నిలువగా రాజస్థాన్ (41,550; 10.2 శాతం), మహారాష్ట్ర (37,144; 9.2 శాతం) జాబితాలో తరువాత స్థానాలలో ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం 2018తో పోల్చితే 2019లో 7.3 శాతం మహిళలపై అత్యాచార హింసలు పెరుగాయని తేలింది. మహిళలపై జరిగే అత్యాచార రేటులో అసోం (లక్షలో 177.8), రాజస్థాన్ (110.4), హర్యానా (108.5) ముందు వరుసలో ఉన్నాయి. రేప్ కేసుల సంఖ్యలో రాజస్థాన్‌లో 5,997 కేసులు, యుపిలో 3,065 కేసులు, ఎంపిలో 2,485 కేసులతో జాబితాలో ముందున్నాయి. రేప్ కేసుల రేటులో రాజస్థాన్ (లక్షలో 15.9), కేరళ (11.1), హర్యానా(10.9)లు చోటు దక్కించుకున్నాయి.

బాలికలపై అత్యాచారాలు అధికంగా యుపి, మహారాష్ట్రలలో జరుగుతున్నాయి. దళిత మహిళలపై జరిగే అత్యాచారాల సంఖ్యలో యుపి (11,829; 25.8 శాతం కేసులు), రాజస్థాన్ (6,794 ; 14.8 శాతం), బీహార్ (6,544;14.2 శాతం) ఉండగా, దళితులపై అత్యాచార రేటులో రాజస్థాన్, ఎంపి, బీహార్‌లు ముందున్నాయి. భర్త లేదా కుటుంబ సభ్యుల హింసకు 30.9 శాతం, దౌర్జన్యానికి 21.8 శాతం, కిడ్నాపులకు 17.9 శాతం, మానభంగాలకు 7.9 శాతం మహిళలు గురి అవుతున్నారు. 2018లో లక్ష మహిళా జనాభాలో 58.8, 2019లో లక్షలో 62.4 మహిళలపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని తేలింది. మహిళలపై మానభంగాల కేసుల్లో న్యాయ వ్యవస్థకు చేరినవి 27 శాతం, చార్జిషీట్ వరకు 85 శాతం చేరుతున్నా యి. మహిళలను దేవతగా కొలిచిన భారతీయ సంస్కృతి ఒకవైపు, అబలను వ్యాపార, అశ్లీల వస్తువుగా చూసే విష చూపులతో మరోవైపు మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. మానభంగమనే భయంకర వ్యాధికి హద్దు, అదుపు, అంతం కనిపించడం లేదు. ఇల్లు, రోడ్డు, పని ప్రదేశాలు ఏవీ సురక్షితంగా లేవు. పగలు, రాత్రి భేదం మరిచి మానవ మృగాలు రెచ్చిపోతున్న భయానక వాతావరణాలు సర్వసాధారణం అయ్యాయి.

మైనర్ బాలికలను కూడా వదలని కీచక విషకోరల విశృంఖల బరి తెగింపులు బాధిస్తూనే ఉన్నాయి. అరణ్యాల్లో సంచరించాల్సిన మగ మృగాలు ఆవాసాల్లో రెచ్చిపోతున్నారు. పాశవిక ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అభద్రతకు అద్దం పట్టే ఇలాంటి దారుణ దుశ్చేష్టలకు చరమగీతం పాడాల్సిందే. ఒంటరి మహిళకు రక్షక గొడుగు పట్టాలి. కుబుసం విడిచిన సుసంస్కారాలకు సంకెళ్ళు పడాలి. అత్యాచార నేరాలను అరికట్టే ఆయుధాలను సత్వరమే సానబెట్టాలి. మహిళలను మర్యాదగా చూస్తూ చిన్నారులకు ప్రేమలు పంచాలి. చట్టం అంటే చావు కనిపించాలి. అత్యాచారమంటే ఆఖరు గడియలు గుర్తు రావాలి. నరరూప రాక్షసుల భరతం పట్టి, ఉరికంబం ఎక్కించాలి. మహిళా దేవతలను మదిన నిలుపుకొని ఇంటిని, సమాజాన్ని స్వర్గసీమగా మార్చుకోవాలి. అబలపై అత్యాచారాలు లేని నవ శీల సమాజాన్ని నిర్మించుకోవాలి.

బి.మధుసూదన్ రెడ్డి
– 9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News