- మంత్రి చామకూర మల్లారెడ్డి
కీసర: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో శివారు మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డుల వికాస్ నగర్‌లో రూ.73 లక్షల అంచనా వ్యయంతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు, హరిదాస్‌పల్లి రోడ్డులో రూ.కోటితో వైకుంఠధామం నిర్మాణ పనులకు మంత్రి మల్లారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ చాలా కాలంగా అభివృద్ధ్దికి నోచుకోని దమ్మాయిగూడలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలగా ఉన్న జవహర్‌నగర్ చెత్త డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తూ సుమారు రూ.500 కోట్లతో విద్యుత్ ప్లాంటు, వ్యర్ధ జలాలను శుద్ధ్ది చేసేందుకు రూ.250 కోట్లతో నీటి శుద్ద్ధి ప్లాంటు నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కెటిఆర్‌ల సహకారంతో దమ్మాయిగూడలో లింక్ రోడ్ల అభివృద్ధ్దికి రూ.90 కోట్లు, అంతర్గత రోడ్లు, భూగర్భ మురుగు కాలువలకు రూ.7.11 కోట్లు, సీవరేజ్ పైప్‌లైన్ల నిర్మాణాలకు రూ.8 కోట్లు మంజూరు కాగా శరవేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు.
మున్సిపాలిటీలో స్మశాన వాటిక సమస్యను పరిష్కరించేలా అవసరమైన స్థలాన్ని స్థలాన్ని కేటాయించి రూ.కోటితో అన్ని వసతులతో వైకంఠధామం నిర్మాణం చేపడుతున్నామని మంత్రి చెప్పారు. వికాస్‌నగర్‌లో మంచినీటి సమస్యను పరిష్కరించామని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్పన్ ఎం.నరేందర్‌రెడ్డి, కమిషనర్ ఎ.స్వామి, కౌన్సిలర్లు ఎం.పావణి, బి.నానునాయక్, ఎన్.సుజాత, కె.హేమలత, ఎం.వెంకటేష్, కె.సురేఖ, ఎస్.స్వప్న, జి.వెంకటరమణ, పి.అనురాధ, వి.రమేష్ గౌడ్, ఎం.నర్సింహ్మారెడ్డి, ఆర్.శ్రీహరి గౌడ్, కో ఆప్షన్ సభ్యులు వహిదాబేగం, వి.రజిని, షేక్ షాదుల్లా, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు కె.తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.హరిగౌడ్, నాయకులు పాల్గొన్నారు.