ఆసిఫాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన సమీకృత కలెక్టరేట్ విధానంతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. త్వరలో జిల్లా కేంద్రంలో నూతన భవనాలు ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు, ఎస్పీ సురేష్‌కుమార్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి డిపిఓ కార్యాలయం, బిఅర్‌ఎస్ జిల్లా కార్యాలయ భవనం, సభస్థలి సందర్శించి, సమీకృత కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించారు.
అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమీకృత వ్యవస్థతో అభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు. 40 విభాగాలతో ఐడిఓసి భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన నిర్మాణాలతో అన్ని హంగులతో పరిపాలన సౌలభ్యం కోసం సమీకృత వ్యవస్థను తీసుకువచ్చినట్లు వివరించారు.
జిల్లాల పునర్విభజన తరువాత జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, దీనికి నిదర్శనం కళ్లముందు కనిపిస్తుందని అన్నారు. గతంలో జిల్లా కేంద్రంలో ఉన్న ఆసిఫాబాద్ అభివృద్ధి చెందలేదని ప్రస్తుతం ఏడు సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. గతంలో హామి ఇచ్చినట్లు పోడు పట్టాల పంపిణీ కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కుమ్రంభీం జిల్లా పోడు పట్టాల పంపిణీ లబ్దిదారుల్లో మూడో స్థానంలో ఉందని అన్నారు. జిల్లాల విభజన తరువాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల వచ్చిందని, అలాగే రానున్న రోజుల్లో ఒక్కో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసిఅర్ పర్యటన సందర్భంగా బిఅర్‌ఎస్ పార్టీ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయ భవనం, కుమ్రంభీం విగ్రహాం, భీంరావు విగ్రహాలు ప్రారంభం, తరువాత కలెక్టరేట్ ప్రారంభించడం జరుగుతుందని, సమయాన్ని బట్టి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సీఎం పర్యటన అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి శ్రీనివాస్, జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపిపి మల్లికార్జున్,, మార్కెట్ కమిటి చైర్మన్ మల్లేష్, సింగిల్‌విండో చైర్మన్ అలిబిన్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.