Monday, January 20, 2025

డ్రగ్స్ విక్రయిస్తున్న ర్యాపిడో డ్రైవర్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

వేర్వేరు కేసుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని నిందితులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, సరూర్‌నగర్, మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 44 గ్రాముల హెరాయిన్, రెండు బైక్‌లు, రెండు వేయింగ్ మిషన్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…రాజస్థాన్ రాష్ట్రం, బార్మార్ జిల్లా, గూడమలానికి చెందిన రమేష్‌కుమార్, మహదేవ్ రామ్ ఇద్దరు ర్యాపిడో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. విక్రం గోయల్, దినేష్ కళ్యాణ్ పరారీలో ఉన్నారు. రమేష్, మహదేవ్ అన్నదమ్ముళ్లు, ఇద్దరు 2022లో బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడ రాజస్థాన్‌కు చెందిన విక్రం గోయల్‌లో కలిసి ఉంటున్నారు. ముగ్గురు హెరాయిన్‌కు బానిసలుగా మారారు. ర్యాపిడో డ్రైవర్లుగా చేయడంతో వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు.

రాజస్థాన్‌లో తక్కువ ధరకు హెరాయిన్ కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశారు. రాజస్థాన్‌కు చెందిన దినేష్ కళ్యాణ్ వద్ద గ్రాముకు రూ.6,000లకు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి రూ.12,000లకు విక్రయిస్తున్నారు. ఏడాది నుంచి ముగ్గురు నిందితులు ఎన్‌వలప్‌లో హెరాయిన్ పెట్టి ర్యాపిడోలో అవసరం ఉన్న వారికి డెలివరీ చేస్తున్నారు. ఇటీవలే మహదేవ్ రాజస్థాన్‌కు వెళ్లి 30 గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చాడు. ఐదురోజుల క్రితం రాజస్థాన్ వెళ్లిన విక్రం గోయల్ వెంటనే హెరాయిన్ విక్రయించాలని రమేష్, మహదేవ్‌కు చెప్పాడు. అతడి సూచనల మేరకు రెండు కవర్లలో డ్రగ్స్ పెట్టి విక్రయించేందుకు వెళ్తుండగా సరూర్‌నగర్, ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 34 గ్రాముల హెరాయిన్, బైక్, రెండు మొబైల్ ఫోన్లు, వేయింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరో కేసులో హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రం, జాలోర్‌కు చెందిన దినేష్‌కుమార్, బార్మార్ జిల్లాకు చెందిన దినేష్ కళ్యాణ్ అలియాస్ దినేష్‌కుమార్ అలియాస్ రాహుల్ భాయ్ అలియాస్ దినేష్ బిష్ణోయ్ అలియాస్ విక్రం భాయ్ అలియాస్ మలానీ కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. దినేష్‌కుమార్‌ను అరెస్టు చేయగా, దినేష్ కళ్యాణ్ పరారీలో ఉన్నాడు. దినేష్‌కుమార్ బతుకు దెరువు కోసం 2013లో హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ ఉంటూ రేయిలింగ్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే దినేష్‌కుమార్‌కు దినేష్ కళ్యాణ్‌తో పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ విక్రయిస్తే గ్రాముకు రూ.500 కమీషన్ ఇస్తానని దినేష్‌కుమార్‌కు దినేష్ కళ్యాణ్ చెప్పాడు. ఇద్దరు కలిసి నగరంలో డ్రగ్స్ అవసరం ఉన్న వారికి హెరాయిన్‌ను ఎన్‌వలప్‌లో పెట్టి ర్యాపిడీలో డెలివరీ చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, మేడిపల్లి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News