Wednesday, January 22, 2025

చీకోటి ఫాంహౌస్‌లో మాట్లాడే చిలుకలు

- Advertisement -
- Advertisement -

మినీ జూను మించిన తోట అటవీశాఖ అధికారుల దాడుల్లో
కనిపించిన వివిధ దేశాల జంతు జాతులు పురాతన రథం, ఇత్తడి
సింహాలు, అరుదైన కళాకృతులు చీకోటి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
విజిలెన్స్, అటవీ, పురావస్తు, ఐటి శాఖల నజర్ క్యాసినో
వ్యవహారంలో సంపత్‌ను కీలక పాత్రధారిగా గుర్తించిన అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాసినో ఏజెంట్ చీకోటి ప్రవీణ్‌కు ఒకవైపు ఇడి, మరోవైపు విజిలెన్స్, అటవీశాఖ, పురావస్తు శాఖలతో పాటు ఐటి శాఖ ప్రత్యేక దృష్టిసారించడంతో పాటు విచారణ సాగిస్తున్నాయి. చీకోటి తన ఫాం హౌస్‌లో అరుదైన జంతువులు, బంధించిన ట్లు ఇడి సమాచారం మేరకు శుక్రవారం నా డు విజిలెన్స్, అధికారుల తనికీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇత్తడి కళాకృతులు, పురాతన రథం, ఇత్తడితో చేసిన ఖ రీదైన విగ్రహాలు ఉన్నట్లు తేలడంతో ఆయా వస్తుసామగ్రి ఎక్కడి నుంచి తరలించారన్న కోణంలో పురావస్తు శాఖ దాడులకు సిద్ధమౌతోంది. ముఖ్యంగా ఇడి అధికారులు చీకోటి ప్రవీణ్ ఇళ్లు, కార్యాలయం, ఫాంహౌస్‌లో నిర్వహించిన దాడులలో చీకోటి అనధికారికంగా జంతువులను, అరుదైన పక్షులను బంధించినట్లు గుర్తించారు. దీంతో ఇడి అధికారుల సమాచారం మేరకు అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈక్రమంలో డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ హే మ నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో చీకోటికి చెందిన 20 ఎకరాల్లో ఉన్న ఫాంహౌస్‌లో అటవీ, విజిలెన్స్ అధికారుల తనికీలు నిర్వహించారు.

ఈ తనికీలలో మాట్లాడే రామచిలుకలు, ఊసరవెల్లులు, ఆఫ్రికన్ జాతికి చెందిన బల్లులు, ఆస్ట్రిచ్, గుర్రాలు, కుక్కలు, ఆవులు, ఉడుములతో పాటు పురాతన రథం, సింహాల ఇత్తడి విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో జంతు అక్రమ రవాణా నియంత్రణ అధికారులు కూడా పాల్గొన్నారు. కాగా చీకోటి ప్రవీణ్ ఫాం హౌస్‌లో వైల్డ్ ఎనిమల్స్ ఉన్నట్టుగా గుర్తించామని, ఈక్రమంలో వైల్డ్ ఎనిమిల్స్ యాక్ట్ ప్రకారంగా ప్రవీణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని డిప్యూటీ రేంజ్ పారెస్ట్ ఆపీసర్ హేమ తెలిపారు.అలాగే అటవీశాఖ నిబంధనలకు విరుద్దంగా ఫామ్ హౌస్ లో ఉన్న జంతువులు, పక్షులను జూ పార్క్‌కు తరలిస్తామని తెలిపారు. ఈ జంతువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఫాంహౌస్ నిర్వహిస్తున్నారనే విషయాలపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా ఫామ్ హౌస్‌లో పైథాన్ వుందని సమాచారం వచ్చిందని, తనికీలలో అది కనిపించలేదని వివరించారు.

విదేశీ మారకంపైఆరా..!

క్యాసినో వ్యవహారంలో కోట్లాది రూపాయల నగదును విదేశీ మారకంగా మార్చిన అంశంపైన ఇడి అధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. భారతదేశానికి చెందిన నగదు నేపాల్ రూపీల్లోకి ఎలా మార్చారు..? అలాగే క్యాసినోలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పంటర్లు గెల్చుకున్న రూపీలను తిరిగి రూపాయల్లోకి ఎలా ఇచ్చారన్న అంశాలపై ఇడి అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే క్యాసినో ఎజెంట్లు చీకోటి, మాధవరెడ్డిలు ఇప్పటి వరకు ఎన్ని టూర్‌లు నిర్వహించారు..? పంటర్లను తరలించినందుకు విమానాలకు వెచ్చించిన మొత్తాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా చీకోటి ప్రవీణ్ ఫోన్ డేటాలో ఉన్న కస్టమర్లు ఎవరెవరు ఎంత మొత్తాలు చెల్లించారు, విదేశాల్లోకి నగదు లావాదేవీలను హవాలా మార్గంలో ఎలా జరిపారన్న విషయాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఈ నేపథ్యంలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిల సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్లలో ఉన్న తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులతో ఉన్న సన్నిహిత సంబంధాలపైనా ఇడి విచారణ చేపడుతోంది.

ఇందులో భాగంగా చీకోటి,మాధవరెడ్డిలకు సంబంధించి ఏడాది కాలంగా వారు వాట్సాప్ చాటింగ్‌లను ఇడి అధికారులు పరిశీలిస్తున్నారు.మరోవైపు క్యాసినో మాటున మనీలాండరింగ్ వ్యవహారంపై ఇడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నేపాల్‌లో ఈ ఏడాది జూన్ 10 నుంచి 13 వరకు నాలుగు రోజులపాటు క్యాసినో వేగస్ బై, బిగ్‌డాడి పేరిట పెద్దఎత్తున గ్యాంబ్లింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంబ్లింగ్‌లో నగదు ఎలాచేతులు మారిందన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. క్యాసినో ఆడించేందుకు తెలంగాణ, ఎపికి చెందిన పంటర్లను హైదరాబాద్ నుంచి బంగాల్‌కు దాదాపు రూ. 50లక్షలు వెచ్చించి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లినట్లు ఇడి అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారానికి ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డి ఏజెంట్లుగా వ్యవహరించారని, అయితే ప్రత్యేక విమానాలు సమకూర్చిన ఆరాధ్య టావెల్స్ అధినేత సంపత్‌ను ఇడి ప్రశ్నించనుంది.

ఎవరీ సంపత్..?

క్యాసినో ఏజెంట్ చికోటి ప్రవీణ్ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఇడి అధికారులు ఆరాధ్య ట్రావెల్స్ అధినేత సంపత్ పాత్రపై విచారణ చేపడుతున్నారు. గోవా,నేపాల్, శ్రీలంకలలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలు నిర్వహించిన క్యాసినోలలో ఆరాధ్య ట్రావెల్స్ అధినేత సంపత్ కీలక పాత్ర ఉందని ఇడి విచారణలో తేలింది. అలాగే రాజకీయ, సినీ ప్రముఖులతో సంపత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, ఈక్రమంలో చికోటి బర్త్ డే పార్టీకి సంపత్ కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఇడి అనుమానిస్తోంది.

అదేవిధంగా క్యాసినో కస్టమర్లను హైదరాబాద్ నుంచి విదేశాలకు విమానాలతో తరలించేందుకు సంపత్ ఫ్లయిట్స్ బుక్ చేసినట్లు గుర్తించారు. గోవా, నేపాల్, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియాలో సంపత్‌కు లింకులున్నాయని, బాలీవుడ్, టాలీవుడ్ తారలతోనూ సంపత్‌కు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు ఇడి విచారణలో వెలుగుచూసింది. బిగ్ డాడీ అడ్డా కోసం సినీ తారలను సంపత్ బుక్ చేశాడని, ఈ నేపథ్యంలో నగరంలోని బంజారాహిల్స్‌లో భరీ ఎత్తున ఓ పబ్ ఏర్పాటు చేసేందుకు చికోటి, సంపత్, మాధవరెడ్డిలు సన్నాహాలు చేసినట్లు తేలింది. చికోటి ప్రవీణ్‌కు చెందిన హవాలా ఆర్థిక లావాదేవీలన్నీ సంపత్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు సంపత్ ఆర్థిక కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. అనతికాలంలో ఆరాధ్య ట్రావెల్స్ అధినేత సంపత్‌కు సైతం ఇడి అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తమౌతున్నారు.

విఐపిలకు నోటీసులు ?

క్యాసినో నిర్వహణకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారాలను పరిశీలించిన ఇడి అధికారులు ప్రమోషన్‌లో నటించిన సినీ ప్రముఖులకు ముట్టిన లావాదేవీలపై ఆరాతీస్తున్నారు. అలాగే ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీతారలకు కూడా ఇడి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఫెమా కేసులో ప్రవీణ్, మాధవరెడ్డిని సోమవారం ప్రశ్నించనున్న ఇడి నిందితుల సమాధానాల మేరకు మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశముంది. అలాగే జూన్ 12న చంపాపేటలోని సామ సరస్వతీ గార్డెన్స్‌లో చీకోటి ప్రవీణ్ దాదాపు రూ. 6 కోట్లు వెచ్చించి నిర్వహించిన తన జన్మదిన వేడుకలకు హాజరైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల చిట్టాను ఇడి అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిల సెల్‌ఫోన్‌లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 18మంది ప్రజాప్రతిధులు, 280 మంది కస్టమర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య జరిగిన లావాదేవీలపై ఆరా తీసేందుకు ఇడి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News