సమస్యకు అత్యాధునిక గుండె సర్జరీ
రోగికి కొత్త జీవితం ప్రసాదించిన వైద్యులు
మనతెలంగాణ/హైదరాబాద్ : తీవ్ర గుండె సమస్యతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో యశోద హాస్పిటల్‌లో చేరిన సిద్దిపేట జిల్లాకు చెందిన కనకయ్యకు వైద్యులు సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. గుండె ప్రధానమైన బృహద్ధమని లోపలి,మధ్య పొరలు చీలిపోవడం అనే అరుదైన సమస్యతో ఆసుపత్రిలో చేరిన రోగికి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి.రమేష్ నేతృత్వంలోని వైద్యుల బృందం విజయవంతంగా సర్జరీ నిర్వహించి రోగికి కొత్త జీవితం ప్రసాదించారు. ఈ సందర్బంగా డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ… సిద్దిపేట జిల్లా నంగనూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడైన కనకయ్య(53) గత నెలలో గుండె నుండి రక్తన్ని తీసుకెళ్ళే అయోర్టా (బృహద్ధమని విచ్ఛిన్నం) బృహద్ధమని లోపలి,మధ్య పొరలు చీలిపోవడం అనే ఒక అరుదైన గుండె సమస్యతో అకస్మాత్తుగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడుతూ ప్రాణాపాయ స్థితిలో తమ వద్దకు వచ్చారని అన్నారు. ఆయనను అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌కు తరలించి, మరిన్ని పరిక్షలు చేసి అతను అయోర్టాతో బాధపడుతున్నట్లు గుర్తించామని తెలిపారు.
దీనికి బెంటాల్ ప్రక్రియ అనే అత్యాధునిక సర్జరీనే సరైన పరిష్కారమని కనకయ్య కుటుంబ సభ్యులకు వివరించామని, వారి ఆమోదంతో సర్జరీ నిర్వహించామని చెప్పారు. బెంటాల్ ప్రక్రియ అనేది బృహద్ధమని కవాటం, బృహద్ధమని రూట్,ఆరోహణ బృహద్ధమని మిశ్రమ గ్రాఫ్ట్ రీప్లేస్‌మెంట్‌తో కూడిన ఒక రకమైన కార్డియాక్ సర్జరీ అని, ఇది కరోనరీ ఆర్టరీలను గ్రాఫ్ట్‌లోకి తిరిగి అమర్చడం అని వివరించారు. తాను కార్డియాలజీ వైద్య బృందం కలిసి సర్జరీ నిర్వహించడం ద్వారా కనకయ్య గుండె బృహద్ధమని కవాటం, గ్రాఫ్ట్ విజయవంతంగా రీప్లేస్‌మెంట్ జరిగిందని తెలిపారు. సర్జరీ తరువాత కనకయ్య చాలా తక్కువ సమయంలోనే కోలుకున్నారని, దాంతో ఆయనను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశామని డాక్టర్ జి. రమేష్ తెలిపారు.