నేడు మన తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమవుతున్నది. ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన ‘గ్రీన్ యాపిల్ అవార్డులను’ వివిధ విభాగాల్లో యాదాద్రి ఆలయం సహా ఐదు నిర్మాణాలు దక్కించుకున్నాయి. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కాగా, ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు రావడం తెలంగాణకు దక్కిన మరో ఘనత.
ఈ అవార్డులకు ఎంపికైన వాటిలో యాదాద్రి ఆలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం, మోజంజాహీ మార్కెట్ ఉన్నాయి. ఇక్కడి భవనాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రతిభకు ఈ అవార్డులు అద్దం పడుతున్నాయని మేధావుల అభిప్రాయం. గ్రీన్ ఆర్గనైజేషన్ 1994లో లండన్‌లో స్థాపించబడింది, ఇది ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ ఉత్తమ అభ్యాసాన్ని గుర్తించడం, బహుమతి ఇవ్వడం, ప్రోత్సహించడం కోసం అంకితం చేయబడిన ఒక స్వతంత్ర లాభాపేక్షలేని సంస్థ. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే వరల్డ్ గ్రీన్సిటీ అవార్డ్ (2022), ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్ (2021), లివింగ్, ఇన్‌క్లూజన్ అవార్డ్- స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్ (2021) వంటి ప్రపంచ స్థాయి అవార్డులను సొంతం చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పునరుద్ధరించిన ఐదు నిర్మాణాలు అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ అవార్డులు అందుకోవడం గొప్ప పరిణామం.
దేశంలోనే తొలిసారి గ్రీన్ యాపిల్ అవార్డులను దక్కించుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం రాష్ట్రంతోపాటు దేశానికీ గర్వకారణమే. ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని రాజీ లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా కట్టడాల నిర్మాణం, పునరుద్ధరణ, సకల జనుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నేడు రాష్ట్రం ముందుకు నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతి నిర్మాణం వెనుక అతీతమైన ముందు చూపు ఉందనే దానికి నిదర్శనం ఈ అవార్డులు. సాధారణంగా కొన్ని ప్రభుత్వాలు మౌలిక వనరుల అభివృద్ధి పరిచే క్రమంలో తాత్కాలిక అంశాలే ప్రధానంగా పని చేస్తున్న ఈ కాలంలో శాశ్వతంగా ఉండేలా, ప్రజలకు అధికారులకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చేసే నిర్మాణాలు, మౌలిక వనరుల అభివృద్ధి, దేవాలయాల నిర్మాణాలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్న తీరు హర్షణీయం. ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు అందరూ ఆలోచించే, విమర్శలు చేసే అంశాలు వ్యయం, కాలపరిమితి.
విపక్షాలు కొన్ని నిర్మాణాలపై విమర్శలు చేసిన అవి నేడు అవార్డులుగా మన రాష్ట్రానికే అరుదైన గౌరవాన్ని ఇస్తున్నాయి. ప్రతి నిర్మాణం భవిష్యత్ తరాలకు అందాలని, వచ్చే వారికి కూడా ఉపయోగపడాలని ఆలోచిస్తూ, అనేక నిర్మాణాలకు నేడు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలొస్తుంది. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ లు, పోలీస్ కార్యాలయాలు, అధునాతన మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ ఆధునిక మార్కెట్లు, శ్మశాన వాటికలు, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, అన్ని పట్టణాల్లో విస్తరించిన రహదారులు, అర్బన్ డెవలప్‌మెంట్ ఇలా చెప్పుకుంటూపోతే ఈ తొమ్మిదేళ్ళల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోలేని అభివృద్ధి, మౌలిక వనరుల గణనీయమైన అభివృద్ధి, అధునాతన నిర్మాణాలు తెలంగాణ ప్రభుత్వం నిర్మించి ప్రజలను అనేక సేవలను అందుబాటులో తెచ్చింది. కెసిఆర్ అంటే ఒక శాశ్వత నిర్మాణాల రూపకర్తగా, సరికొత్త ప్రభుత్వ విధానాల ఆరంభకుడిగా నేడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అన్ని ప్రధాన రంగాల్లో ముందంజలో ఉండేలా అనునిత్యం కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు, జాతీయ అధికారిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పలు అవార్డులు నేటి ప్రగతికి మార్కులు.
డా. శ్రవణ్ కుమార్ కందగట్ల- 8639374879