Thursday, December 19, 2024

దక్షిణ కొరియాలో అరుదైన ఇన్‌ఫెక్షన్… ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

సియోల్: చైనాలో సరికొత్త రకం కొవిడ్ 19 వ్యాప్తితో ఆసియా దేశాలు వణికి పోతుండగా దక్షిణ కొరియాలో మెదడుకు సోకే అరుదైన ఇన్‌ఫెక్షన్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఒక వ్యక్తి ప్రాణాలు బలిగొంది. ‘నెగ్లెరియా ఫౌలెరి’ గా పిలిచే ఈ ఇన్‌ఫెక్షన్ సోకి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ ఇన్‌ఫెక్షన్‌ను మెదడును తినే అమీబాగా పేర్కొంటారు. ఈ వ్యక్తికి థాయ్‌లాండ్‌లో ఇది సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇతడు మూడు నెలలు అక్కడే ఉండి, డిసెంబర్ 10న దక్షిణ కొరియాకు చేరుకొన్నాడు.

ఏమిటీ నెగ్లెరియా ఫౌలెరి?
నెగ్లెరియా ఒకరకమైన ఏక కణ సూక్ష్మజీవి. సాధారణంగా అమీబాలు ప్రకృతిలో చాలా చోట్ల ఉంటాయి. మంచినీరు, నీటి లీకేజీల్లో, కాల్వలు, నదులు, మట్టిలో ఇవి జీవిస్తుంటాయి. అన్ని రకాల అమీబాలు మనుషుల ప్రాణాలు తీయవు. కానీ, వీటిలో నెగ్లెరియా రకం అమీబా మనుషులకు సోకుతుంది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం నెగ్లెరియా ఫౌలెరి ముక్కుద్వారా మనిషి శరీరం లోకి ప్రవేశిస్తుంది. ఇది ఆ తర్వాత మెదడుకు చేరుతుంది. అక్కడ మెదడు లోని కండరాలు, నరాలను దెబ్బతీస్తుంది. ఇది ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్‌సైఫలిటిస్ (పిఎంఎ) అనే ఇన్‌ఫెక్షన్‌ను కలగజేస్తుంది. ఇది ప్రాణాంతకమైంది. ముఖ్యంగా వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ ఇన్‌ఫెక్షన్ వస్తుంది.

దీని లక్షణాలు..
పీఎంఏ ఇన్‌ఫెక్షన్ సోకితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, ముక్కు బిగుసుకు పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇన్‌ఫెక్షన్ తీవ్రమైతే మూర్ఛ, గందరగోళం, వంటి లక్షణాలతోపాటు, రోగి కోమాలోకి కూడా పోవచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్ చాలా తీవ్రమైంది. అమెరికాలో 1962 నుంచి 2021 వరకు 154 మందిలో ఇది కనిపిస్తే, వారిలో కేవలం నలుగురు మాత్రమే బతికారు. ఇది మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందక పోవడం మాత్రం ఊరటనిస్తుంది.

చికిత్స, వ్యాక్సిన్లు ఉన్నాయా?
కొన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రభావవంతమైన చికిత్సను కనుగొనలేదు. కొన్ని రకాల ఔషధ సమ్మేలనాలతో దీనికి వైద్యం చేస్తారు. యాంఫోటెరసిన్ బి, అజిత్రోమైసిన్, ఫ్లూకోనజోల్, రిఫాపిన్, మిల్టెఫోసిన్, డెక్సామెథాసిన్ వంటి వాటిని వాడతారని సీడీసీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News