Monday, November 18, 2024

ఐపిఎల్‌లోనే అరుదైన రికార్డులు

- Advertisement -
- Advertisement -

Rare records in the Indian Premier League

 

వీటిని చెరిపేయడం కష్టమే!

మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌కు ఉన్న ఆదరణ మరే లీగ్‌కు లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐసిసి క్రికెట్ టోర్నీల తర్వాత అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ టోర్నీగా ఐపిఎల్ పేరు తెచ్చుకుంది. భారత్‌తో సహా క్రికెట్ ఆడే అన్ని దేశాల అగ్రశ్రేణి క్రికెటర్లు ఈ లీగ్‌లో పాల్గొనడం అనవాయితీగా వస్తోంది. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, డివిలియర్స్, డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్, లసిత్ మలింగ వంటి ఎందరో విదేశీ క్రికెటర్లు ఐపిఎల్‌పై తమదైన ముద్ర వేశారు. వీరితో పాటు భారత్‌కు చెందిన సురేశ్ రైనా, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, బుమ్రా, గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, ధావన్ తదితరులు కూడా ఐపిఎల్‌లో ఎన్నో రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. అయితే వీరిలో కొంత మంది క్రికెటర్లు సాధించిన రికార్డులు ఐపిఎల్ చరిత్రలోనే చిరకాలం చెక్కు చెదరకుండా ఉండి పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కొన్ని రికార్డులను ఒకసారి గుర్తు చేసుకుందాం.

నాలుగు శతకాల కోహ్లి..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఐపిఎల్‌లో అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా బెంగళూరు ప్రధాన అస్త్రంగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లి ఓ ఐపిఎల్ సీజన్‌లో ఏకంగా నాలుగు శతకాలు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 2016 ఐపిఎల్‌లో కోహ్లి ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. ఆ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి 16 మ్యాచుల్లో 81.08 సగటుత 973 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లి స్ట్రైక్‌రేట్ 152.03 కావడం అతని దూకుడుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో కోహ్లి నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డును అందుకోవడం ఇతర బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదనే చెప్పాలి.

గేల్ విధ్వంసం..

పొట్టి క్రికెట్‌లో అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2013 ఐపిఎల్ సీజన్‌లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన గేల్ పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేవలం 66 బంతుల్లోనే గేల్ 17 సిక్సర్లు, మరో 13 ఫోర్లతో అజేయంగా 175 పరుగులు సాధించాడు ఐపిఎల్‌తో పాటు టి20 ఫార్మాట్‌లో కూడా ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. ఈ రికార్డును బ్రేక్ చేయడం కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. అంతేగాక ఐపిఎల్‌లో గేల్ మరో అరుదైన రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. 2011లో కోచి టస్కర్స్ కేరళతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఒకే ఓవర్‌లో 37 పరుగులు బాదేశాడు. ఈ క్రమంలో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా గేల్ నిలిచాడు. ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన మూడో ఓవర్‌లో గేల్ 6,6,4,4,6,6,4 పరుగులు సాధించాడు. ఇందులో రెండో బంతి నోబాల్ కావడంతో ఆ ఓవర్‌లో మొత్తం 37 పరుగులు లభించాయి.

విరాట్, ఎబిలో రికార్డు భాగస్వామ్యం

మరోవైపు బెంగళూరు స్టార్ ఆటగాళ్లు ఎబి.డివిలియర్స్, విరాట్ కోహ్లిల జోడీ ఓ అరుదైన రికార్డును సాధించింది. 2016లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి, డివిలియర్స్ జోడీ రెండో వికెట్‌కు ఏకంగా 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చరిత్ర సృష్టించింది. ఐపిఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక పార్ట్‌నర్‌షిప్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఏ జోడీ కూడా ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టలేక పోయింద. మరోవైపు కోహ్లి డివిలియర్స్ సాధించిన 215 పరుగుల పార్ట్‌నర్‌షిప్ ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉండడం మరో విశేషంగా చెప్పొచ్చు.

అల్జరీ జోసెఫ్ రికార్డు బౌలింగ్..

2019లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ తన మొదటి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో జోసెఫ్ 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఐపిఎల్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ బౌలింగ్‌గా కొనసాగుతోంది. అంతేగాక ఆరంగేట్రం మ్యాచ్‌లోనే చారిత్రక బౌలింగ్‌తో జోసెఫ్ పెను సంచలనం సృష్టించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జోసెఫ్ రికార్డును బద్దలు కొట్టడం ఇతర బౌలర్లకు అనుకున్నంత తేలిక కాదని చెప్పక తప్పదు. దీంతో పాటు మరెన్నో రికార్డులు ఐపిఎల్‌లో నమోదయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News