Tuesday, January 14, 2025

దమ్ముంటే..ఎంఎల్‌ఎ సంజయ్ రాజీనామా చేయాలి:రసమయి బాలకిషన్

- Advertisement -
- Advertisement -

ప్రశ్నిస్తే హుజురాబాద్ ఎంఎల్‌ఎ పౌడి కౌశిక్ రెడ్డిపై నాలుగు తప్పుడు కేసులు పెట్టారని, బిఆర్‌ఎస్ నాయకులను వేధించేందుకే ఇలా చేస్తున్నారని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్ విమర్శించారు. ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్‌పై దాడి చేశారని ఆరోపిస్తుండగా, తనపై ఎవరు దాడి చేయలేదని సంజయ్ చెబుతున్నారన్నారు. అలాంటప్పుడు కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. దమ్ముంటే… సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలతో గెలవాలని సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేత చింతం సదానందంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌లో ముగ్గురు మంత్రుల సాక్షిగా జరిగిన అరాచకాన్ని ఖండిస్తున్నామన్నారు.

తమ మౌనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనపై ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై జగిత్యాల ఎంఎల్‌ఎ సంజయ్ కుమార్ మాట్లాడారని, అయితే సంజయ్ ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారని హుజురాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి అడిగారని అన్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు మంత్రులకు అసహనం ఎందుకు అని అడిగారు. ఇద్దరు ఎంఎల్‌ఎలు నిలదీస్తేనే అసహనం వ్యక్తం చేస్తున్న వాళ్లు ప్రజలకు ఏం జవాబు చెబుతారని నిలదీశారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీని తలపిస్తోందని పేర్కొన్నారు.

కౌశిక్ రెడ్డిపై నాలుగు కేసులు పెట్టారని, కానీ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరేకపూడి గాంధీపై కేసు పెట్టారా…? అని ప్రశ్నించారు. భువనగిరిలో తమ పార్టీ ఆఫీస్‌పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సంజయ్ సిగ్గు లేకుండా ఇంకా స్పీకర్‌ను కలిశారని విమర్శించారు. కౌశిక్ రెడ్డి బానిసలాగా బతకాలి అనుకోవటం లేదని, అందుకే కౌశిక్ రెడ్డిపై ద్వేషం పెంచుకున్నారని అన్నారు. ప్రశ్నిస్తే పాపం అన్నట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News