ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఒకే ఒక్కడుగా రషీద్ ఖాన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు టీ20ల్లో (అంతర్జాతీయం+లీగ్‌లు) రషీద్.. 633 వికెట్లు పడగొట్టాడు. దీంతో వెస్టిండీస్ లెజెండ్ డ్వేన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు.
గ్కెర్‌బెర్హాలో పార్ల్ రాయల్స్‌తో జరిగిన MI కేప్ టౌన్ క్వాలిఫయర్ వన్ మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో, రషీద్ తన నాలుగు ఓవర్లలో 2 రెండు కీలక వికెట్లు తీయడంతో ఈ రేర్ ఫీట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం 461 టీ20ల్లో రషీద్ 18.07 సగటుతో 633 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 6/17 అత్యుత్తమ గణాంకాలు నెలకోల్పాడు. రషీద్ తన కెరీర్‌లో మొత్తం నాలుగు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
కాగా, బ్రావో తన 18 ఏళ్ల టీ20 కెరీర్‌లో వెస్టిండీస్, ఇతర ఫ్రాంచైజీలతో కలిపి 24.40 సగటుతో 631 వికెట్లు పడగొట్టాడు. అతని టీ20 కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు 5/23 సాధించాడు. తన టీ20 కెరీర్‌లో మూడు ఐదు వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తర్వాత వెస్టిండీస్ స్పిన్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ (536 మ్యాచ్ లలో 21.60 సగటుతో 574 వికెట్లు, ఉత్తమ గణాంకాలు 5/19), దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (428 మ్యాచ్‌లలో 19.99 సగటుతో 531 వికెట్లు, ఉత్తమ గణాంకాలు 5/23), బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ (444 మ్యాచ్‌లలో 21.49 సగటుతో 492 వికెట్లు, ఉత్తమ గణాంకాలు 6/6) ఉన్నారు.