అబుదాబి: అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ అరుదైన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అఫ్గాన్ టి20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని రషీద్ తోసిపుచ్చాడు. సారథ్య బాధ్యతలు తీసుకుంటే తన ఆట గాడితప్పే ప్రమాదం ఉందనే భయంతో కెప్టెన్సీకి దూరంగా ఉండాలని నిర్ణయించాడు. గత మూడేళ్లుగా అఫ్గానిస్థాన్ జట్టు తరచుగా కెప్టెన్లను మారుస్తూ వస్తోంది. తాజాగా రషీద్‌ను టి20 జట్టు కెప్టెన్‌గా నియమించాలని భావించింది. ఇదే విషయాన్ని రషీద్ దృష్టికి తీసుకెళ్లింది. కానీ రషీద్ మాత్రం అఫ్గాన్ బోర్డు విన్నపాన్ని తోసిపుచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను కెప్టెన్సీకి సిద్ధంగా లేనని బోర్డుకు స్పష్టం చేశాడు. సారథ్య బాధ్యతలు తన ఆటపై ప్రభావం చూపడం ఖాయమని, అందుకే కెప్టెన్సీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తేల్చి చెప్పాడు. ఇక బోర్డు కూడా రషీద్ నిర్ణయాన్ని గౌరవిస్తూ వేరే ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగింగే పనిలో నిమగ్నమైంది.