భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనితో మీడియాలో, బయట ఈ విషయంలో చర్చ ఊపందుకోనున్నది. రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల కానున్నది. లోక్‌సభలో, మెజారిటీ అసెంబ్లీలలో బిజెపి, దాని మిత్ర పక్షాలకు చాలినంత బలం ఉన్నందున ప్రధాని మోడీ కోరుకొన్న వ్యక్తే కొత్త రాష్ట్రపతిగా రైసానా హిల్స్‌లో ప్రవేశించగలరని భావిస్తున్నారు. ప్రచార్భాటం పట్ల బొత్తిగా ఆసక్తిలేని సాదాసీదా వ్యక్తిని మాత్రమే రాష్ట్రపతిగా మోడీ కోరుకుంటున్నారు కాబట్టి ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కొనసాగించవచ్చుననే ఊహాగాలున్నాయి. లేదా ఈ సారి ముస్లింకో, గిరిజనులకో రాష్ట్రపతి భవన్‌లో ప్రాతినిధ్యం కల్పిస్తారనే అంచనాలు కూడా బయలుదేరాయి.
ఈ సందర్భంగా కేరళ గవర్నర్ మొహమ్మద్ ఆరీఫ్ ఖాన్, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 25వ తేదీతో ముగుస్తుంది. అంతకు కొద్ది రోజుల ముందు జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జులై 21న జరుగనుంది. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి రాష్ట్రపతి అవకాశం లభించే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. అదేమైనప్పటికీ ఎన్నిక ఖాయం. ఈ ఎన్నికలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభల సభ్యులు ఓటర్లుగా వుంటారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు 776 మంది, అన్ని శాసన సభల సభ్యులు కలిసి 4033 మంది. గత రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ 21శాసన సభలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అధికారంలో ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 18కి తగ్గిపోయింది.అలాగే గతంతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బిజెపి బలం 50 స్థానాలు తగ్గింది.
ఇటువంటి స్వల్ప లోపాల వల్ల ఎన్‌డిఎ తన అభ్యర్థిని గెలిపించుకోడానికి బయటి చిన్న చిన్న పార్టీల మద్దతు తీసుకోక తప్పదు. ఒడిశా పాలక పక్షం బిజెడి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్‌ఆర్‌సిపిల మద్దతు బిజెపికి లభించవచ్చని భావిస్తున్నారు. అయితే దేశంపై బిజెపి గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి రాష్ట్రపతి ఎన్నికలను వొక అవకాశంగా ప్రతిపక్షాలు ఉపయోగించుకోదలిస్తే పోటీ చివరి వరకూ రసవత్తరంగా ఉండవచ్చు. దేశాన్ని యెదురులేని రీతిలో ఎల్లకాలం పాలించాలని, కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను సాధించాలని ఆశించిన బిజెపి వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేపట్టగలిగిందిగాని రాజకీయ శత్రు నిశ్శేషం చేసుకోలేకపోయింది.
లోక్‌సభలో స్పష్టమయిన మెజారిటీ లభించిన వెంటనే బిజెపి తన కఠిన హిందుత్వ ఎజెండాను అమలు చేయడం ప్రారంభించడంతోనూ, అందరినీ కలుపుకొనిపోయి దేశానికి మంచి పరిపాలన అందించడాన్ని పక్కనబెట్టి ప్రజలను మతపరంగా చీల్చి పాలించడం వల్లనూ, ముస్లిం వ్యతిరేకత శృతి మించినందు వల్లనూ, మతపరంగానే గాక, భాషా పరంగనూ విద్వేషాలు రగిలిస్తూ ఉండడం కారణంగానూ దానికి వ్యతిరేకత పెరిగింది. ఆర్ధికంగా బిజెపియేతర రాష్ట్రాలను ఇబ్బందులపాలు చేయడం, రాజ్యాంగపరమైన ఫెడరల్ నీతిని కబళించడం, కేంద్ర నేర దర్యాప్తు సంస్థలను రాజకీయ స్వప్రయోజనకాండకు దుర్వినియోగపరుస్తున్నదనే విమర్శ, ఆపఖ్యాతి వచ్చి చేరడం వంటి అంశాల వల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో ఇతరుల తోడ్పాటు కూడగట్టుకొనే విషయంలో బిజెపికి పరిమితులు ఏర్పడ్డాయి. ఉద్దండులైన తెలంగాణ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో తిరిగి సెక్యులర్, సోషలిస్ట్ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ భిన్నత్వంలో ఏకత్వ లక్షణానికి కలిగిన విఘాతాన్ని తొలగించాలని గట్టిగా కోరుకొంటున్నారు.
దారుణంగా బలహీనపడిపోయిన జాతీయ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలన్న కాంక్షతో తనను తాను మార్చుకొనే వైపు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రపతి ఎన్నికలను బిజెపికి నల్లేరు మీద బండి కానీయరాదనే సంకల్పం ప్రతిపక్షంలో చోటు చేసుకొంటున్నది. అందుచేత ప్రతిపక్షం ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేము. దేశంలో మార్పు తీసుకురావడమే ధ్యేయం గా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అడుగులు వేస్తున్నారు. ఎన్‌డిఎ పక్షాల మధ్య అనైక్యత కూడా రాష్ట్రపతి ఎన్నికలో బిజెపి అభ్యర్థికి ఇబ్బందులు కలిగించవచ్చు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిజెపి అధిష్ఠానంతో తీవ్రంగా విభేదించి వున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచే రీతిలో బిజెపి పావులు కదిపి తన పార్టీని అసెంబ్లీలో సంఖ్యాపరంగా దారుణంగా దెబ్బ తీసిందనే బాధ ఆయనలో గాఢంగా వుంది. ఆయనను ప్రతిపక్షం ఈ ఎన్నికల్లో తన వ్యూహానికి అనుగుణంగా ఉపయోగించుకొనే అవకాశాలు లేకపోలేదు. అందుచేత రాష్ట్రపతి ఎన్నిక ఈసారి ఉత్కంఠ రేకెత్తించవచ్చు.