Wednesday, January 22, 2025

పతి – పత్ని

- Advertisement -
- Advertisement -

Rashtrapatni Comment Controversy భాష మూలాలు ఎక్కడ ఉంటాయి, పదాలు తమంతట తాముగా పుడతాయా? వాటి వెనుక ప్రత్యేక విలువలు, భావాలు ఉంటాయా? స్వాతంత్య్రం వచ్చి, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించుకొని అమల్లోకి తెచ్చుకొన్న తర్వాత చాలా కాలానికి ఈ ప్రశ్న ఇప్పుడు దూసుకు వచ్చింది. కొత్త రాష్ట్రపతిగా ఆదివాసీ వనిత ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఈ ప్రశ్నకు ఆస్కారం కలిగింది. దేశ అత్యున్నత రాజ్యాంగ పీఠం అయిన రాష్ట్రపతి భవన్‌లోకి స్వాతంత్య్రానంతర తరానికి చెందిన సంతాల్ గిరిజన మహిళ అడుగు పెట్టడం, ఆమె ఆ పదవిని అలంకరించిన తొలి ఆదివాసీ కావడం దేశ ప్రజలందరినీ సంతోషాంతరంగులను చేసింది. అదే సమయంలో బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడొకరు ఆమెనుద్దేశించి ‘రాష్ట్రపత్ని’ అనడం పట్ల బిజెపి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దానితో అది వివాదాస్పదమైంది. ఈ విషయంలో దేశ ప్రజలు తనను ఎంతమాత్రం సమర్థించరని గమనించిన అధిర్ రంజన్ రాష్ట్రపతికి క్షమాపణ చెప్పడం జరిగిపోయినందున రాజకీయంగా అది ముగిసిపోయినట్టే. దేశ రాజ్యాంగ ఆశయాలకు, సంప్రదాయ సామాజిక విలువలకు గల వైరుధ్యమే ‘రాష్ట్రపత్ని’ అనే సంబోధనను వివాదాస్పదం చేసింది.

పతి అంటే భర్త, పత్ని అంటే భార్య అని అర్ధాలున్నందున, భార్యను భర్తకు లోబడి, ఇంటికే పరిమితమై ఉండే స్త్రీగా మాత్రమే చూస్తున్న సమాజం కాబట్టి మహిళ అయిన దేశాధ్యక్షురాలిని రాష్ట్రపత్ని అనడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అదే విధంగా భర్త అనే అర్ధంలో పతి పదాన్ని రాష్ట్ర అనే దానికి చేర్చడం పట్ల సైతం అభ్యంతరముండాలి. కాని అలా జరగడం లేదు. పతిని అధినేత అనే అర్ధంలో స్వీకరిస్తున్నామని పత్నికి ఆ అర్ధం లేదనే అభిప్రాయంతో దేశాధ్యక్షురాలిని రాష్ట్రపత్ని అనడం క్షంతవ్యం కాదంటున్నారు. సమాజ దృష్టి అలా ఉంది కాబట్టి రాష్ట్రపత్ని అనడాన్ని అందరూ వ్యతిరేకించాల్సిందే. రాష్ట్రపతి, సభాపతి అనే పదాలను లింగ తటస్థమైనవిగా రాజ్యాంగం పరిగణిస్తున్నందున ఆ పదవులను, అందులోని వారిని అలాగే సంబోధించాలని, వేరే అర్ధాలు తీయడం తగదన్న మాట సత్యమే. కాని అధిర్ రంజన్ వంటి విపరీత వ్యక్తిత్వం గల వారు రాష్ట్రపత్ని అని న్యూనార్ధంలో వాడే ప్రమాదం తొలగిపోదు. నన్ను ప్రశ్నించే దమ్ము ఎవడికుందిరా అంటారు. అంటే ప్రశ్నించడం, ఎదిరించడం అనేవి పురుష లక్షణాలే గాని మహిళలు చేసేవి కాదనే గట్టి అభిప్రాయం వల్లనే ఇటువంటి ప్రయోగాలు స్థిరపడిపోయాయి. ‘డు’ బదులు ‘రు’ వాడితే స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తుంది.

కాని అలా వాడడానికి మనసు రాదు. ఇందిరా గాంధీని అయినా వచ్చింది, పోయింది అంటామే గాని ‘రు’ అనము. రేపటి సమాజంలో స్త్రీ పురుషులను సమానంగా పరిగణించే నూతన విలువలు అవతరిస్తాయనే ముందు చూపు లేకుండా ‘రాష్ట్రపతి’, ‘సభాపతి’ వంటి పదాలను ఆయా ఉన్నత పదవులకు పెట్టి లింగ తటస్థ పదాలుగా వాటిని పరిగణించాలన్నారు. కాని పత్ని అనే పదాన్ని న్యూనార్ధంలో వాడడంలో ఆనందం పొందే అధిర్ రంజన్ల తలకు అది ఎక్కుతుందా? క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుంచే మన దేశంలో శ్రేణులవారీగా పాలకులకు రాష్ట్రపతి (గవర్నర్) గ్రామపతి (గ్రామాధికారి) అని వాడుకలో వున్నట్టు చరిత్ర చెబుతున్నది. ప్రెసిడెంట్ అనే పదానికి ఆంగ్లంలో ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత రాజకీయ పదవిని అలంకరించే వ్యక్తి అని అర్ధం. ఇందులో స్త్రీ, పురుష లింగపరమైన ధ్వని లేదు. పతి అంటే మాత్రం మగడు, ఏలిక అని నిఘంటువు చెపుతున్నది. ఇకనైనా లింగ ప్రసక్తిలేని పదాలను వినియోగంలోకి తేలేమా? అనుకొన్న తడవుగా పట్టణాలు, నగరాల పేర్లను మార్చివేస్తున్న కాలంలో ఉన్నత పదవులకు ప్రజాస్వామిక పదాలను పెట్టుకోడం మంచిది.

ఆధునిక కాలంలో భార్య, భర్త అనే పదాలే అంతర్ధానమై సహచరి, సహచరుడు అని పిలుచుకొంటున్నారు. స్త్రీవాదులు రాష్ట్రపతి పదాన్ని వ్యతిరేకించిన సందర్భాలున్నాయి. హిందీలో పతి అంటే భర్త అనే అంటారు కాబట్టి ఆ పదం వద్దని ప్రతిభా పాటిల్ దేశ అధ్యక్షులు అయినప్పుడు వారి నుంచి సూచనలు వచ్చాయి. శివసేన అధినేత బాల్ థాకరే 2007లో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి అయినప్పుడు ‘దేశాధ్యక్ష’ అని పిలవడం మంచిదని తన పార్టీ పత్రిక సామ్నాలో సూచించారు. రాజ్యాంగ సభ 1947లో సమావేశమైనప్పుడు రాష్ట్రపతికి బదులు రాష్ట్రనేత, కెప్టెన్ అనే ప్రత్యామ్నాయాలు పరిశీలనకు వచ్చాయి. ఇప్పటికే చైర్మన్‌కు బదులు చైర్ పర్సన్, స్పోక్స్ మ్యాన్ బదులు స్పోక్స్ పర్సన్ అని అంటున్నాము. పోస్టు మ్యాన్‌కు కూడా పోస్టు పర్సన్ అనడం మంచిది. 1948లో రాజ్యాంగ సభలో ఈ విషయం మళ్ళీ చర్చకు వచ్చినప్పుడు డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగం ముసాయిదాలో అనేక ఆంగ్ల, హిందీ ప్రత్యామ్నాలను సూచించారు. ప్రెసిడెంట్ అనేది అందులో ఒకటి, హింద్ కా ఏక్ ప్రెసిడెంట్ అనే ప్రతిపాదన కూడా ఉంది. అలాగే ప్రధాన్, సర్దార్, సిఇఒ అనేవి కూడా వినవచ్చాయి. అందుచేత రాష్ట్రపతి, సభాపతి వంటి పదాలకు ప్రత్యామ్నాయాలను స్థిరపరచవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News