భారత రత్న ప్రచారంపై నెటిజన్లకు రతన్ టాటా విజ్ఞప్తి
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న ’పురస్కారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించిన రతన్ టాటా.. ఆ ప్రచారాన్ని ఆపాలంటూ నెటిజన్లను కోరారు. అవార్డులకంటే దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడమే గొప్ప అదృష్టంగా భావిస్తానని అన్నారు. అసలేం జరిగిందంటే.. డాక్టర్ వివేక్ బింద్రా అనే మోటివేషనల్ స్పీకర్ తన ట్విట్టర్ ఖాతాలో రతన్ టాటా గురించి ఓ ట్వీట్ చేశారు. పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన సేవలకు గాను టాటాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని, అందుకోసం తమ ‘Bharata Ratna For RatanTata’ ప్రచారంలో చేరాలని పిలుపునిచ్చారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది.
రతన్ టాటా భారతరత్నకు అర్హులంటూ ఆయన అభిమానులు, నెటిజన్లు వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఈ ప్రచారంపై రతన్‌టాటా ట్విట్టర్ వేదికగా స్పందించారు.‘ నాకు అవారు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో కొందరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలను నేను అభినందిస్తున్నా. అయితే ఇలాంటి ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని వినమ్రంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. వీటన్నిటికంటే నేను భారతీయుడ్ని అవడం.. దేశాభివృద్ధి, శ్రేయస్సుకోసం నా వంతు సహకారం అందించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తున్నా’ అని టాటా తెలిపారు. పారిశ్రామికవేత్తగా , దాతగా కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో స్థానం సంపాదించిన రతన్ టాటా.. దేశంలో కరోనా విజృంభించిన వేళ రూ.1500 కోట్లు విరాళం ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆయన సేవలకుగాను కేంద్రప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.