ప్రజాస్పందనకు ప్రధాని మోడీ ధన్యవాదాలు
న్యూఢిల్లీ: పిఎం కేర్స్ ఫండ్‌కు మనస్ఫూర్తిగా విరాళాలు అందచేసినందుకు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యావాదాలు తెలిపారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా నామినేట్ అయిన ట్రస్టీలు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి థామస్, లోక్‌సభ మాజీ డిప్యుటీ స్పీకర్ కరియా ముండా, టాటా ఎమిరైటస్, టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా పాల్గొన్నట్లు పిఎంఓ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. పిఎం కేర్స్ ఫండ్‌కు చెందిన బోర్డు ఆఫ్ ట్రస్టీలతో మంగళవారం ప్రధాని మోడీ ఒక సమావేశం నిర్వహించారు. పిఎం కేర్స్ ఫండ్ సహాయంతో చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఈ సమావేశంలో వివరించారు. 4,345 మంది పిల్లలకు తోడ్పడుతున్న పిల్లల పథకాన్ని కూడా ఈ సమావేశంలో వివరించినట్లు పిఎంఓ తెలిపింది. పిఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న కాలంలో పిఎం కేర్స్ ఫండ్ నిర్వహించిన పాత్రను ట్రస్టీలు ప్రశంసించారు.