టాటా నిరాడంబరతకు నెటిజన్లు సెల్యూట్
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరు, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా నిరాడంబరతకు మారుపేరు. వ్యాపారవేత్తల వేడుకలు ఒక పెద్ద పార్టీని తలపిస్తాయి. అలాంటిది రతన్ తన 84వ జన్మదిన వేడుకను ఇంటిలో ఎంతో సాధారణంగా జరుపుకున్నారు. రతన్ టాటా పుట్టినరోజు వీడియో వైరల్ అవుతోంది. రతన్ టాటా డిసెంబర్ 28న 84 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బుధవారం లింక్డ్ఇన్లో ఒక వీడియో కనిపించింది, అందులో రతన్ టాటా కప్కేక్పై కొవ్వొత్తిని ఆర్పి తన పుట్టిన రోజును జరుపుకోవడం కనిపించింది. ఈ వీడియోలో యువ ఉద్యోగి శంతను నాయుడు ఉన్నాడు. శంతను రతన్ టాటాకు యువ స్నేహితుడు, అతను టాటా గ్రూప్‌లో పనిచేస్తున్నాడు.
రతన్ టాటా పుట్టినరోజు వీడియో క్లిప్‌ను టాటా మోటార్స్ ఫైనాన్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ వైభవ్ బోయిర్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. దీని తర్వాత ఈ వీడియో ట్విట్టర్లో కూడా కనిపించడం ప్రారంభించింది. ఇలా చాలా మంది దీనిని పంచుకోవడంతో ఇది వైరల్‌గా మారింది. టాటా గ్రూపును కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన రతన్ టాటా 1937 డిసెంబర్ 28న జన్మించారు. రతన్ టాటా 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా, అలాగే 2016 అక్టోబర్ నుండి 2017 ఫిబ్రవరి వరకు తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం టాటా గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్‌కు అధిపతిగా కొనసాగుతున్నారు.
A charming scene with the unassuming #RatanTata on his 84th birthday pic.twitter.com/wkmm7jhCyZ
— Harsh Goenka (@hvgoenka) December 29, 2021