Sunday, December 22, 2024

అమితాబ్ నుంచి అప్పు తీసుకున్న రతన్ టాటా

- Advertisement -
- Advertisement -

ఈ నెల 9న కన్ను మూసిన పారిశ్రామికవేత్త, దాత రతన్ టాటా గురించి బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కొన్ని అద్భుత జ్ఞాపకాలు పంచుకున్నారు. సినీ దర్శకురాలు, ఫరా ఖాన్, నటుడు బొమన్ ఇరానీ అతిథులుగా పాల్గొన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కెబిసి) సీజన్ 16లో అమితాబ్ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాతో తాను జరిపిన ఒక చిరస్మరణీయ ముఖాముఖిని గుర్తు చేసుకున్నారు. టాటాను ‘ఒక సాధారణ మానవుని’గా పేర్కొంటూ, ‘ఆయన ఎటువంటి వ్యక్తో వర్ణించలేను’ అని బచ్చన్ చెప్పారు. ఒక సారి తాను, టాటా లండన్‌కు విమానంలో వెళ్లామని, హీత్రో విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనకు సహాయకులు ఎవరూ కనిపించలేదని బచ్చన్ తెలిపారు. బచ్చన్ చిరునవ్వుతో గుర్తు చేసుకుంటూ ‘ఆయన ఒక కాల్ కోసం ఫోన్ బూత్‌లోకి వెళ్లారు, నేనే ఆ పక్కనే నిల్చున్నాను, కొంత సేపైన తరువాత ఆయన నా వద్దకు వచ్చారు, ‘అమితాబ్! మీ నుంచి కొద్దిగా డబ్బు నేను అప్పుగా తీసుకోవచ్చా. ఫోన్ కాల్‌కు నా దగ్గర డబ్బు లేదు’ అని ఆయన అన్నప్పుడు నేను నమ్మలేకపోయాను’ అని చెప్పారు.

టాటా మిత్రులను కూడా విస్మయపరచిన ఆయన హుందాతనం గురించి కూడా బచ్చన్ గుర్తు చేసుకున్నారు. రతన్ టాటాతో కలసి ఒక కార్యక్రమానికి హాజరైన ఒక మిత్రుడు ఇంటికి తనను కారులో తీసుకువెళ్లవలసిందని ఆయనను టాటా కోరారని బచ్చన్ తెలిపారు. ‘నన్ను ఇంటి వద్ద దిగబెడతారా? మీ ఇంటి వెనుకే నేను నివసిస్తుంటా’ అని తన మిత్రునితో టాటా అన్నారని బచ్చన్ తెలిపారు. ‘నాకు కారు లేదు’ అని రతన్ టాటా చెప్పడాన్ని మీరు ఊహించగలరా? అది నమ్మశక్యం కాదు’ అని బచ్చన్ అన్నారు. రతన్ టాటాతో బచ్చన్‌కు వృత్తిగత అనుబంధం కూడా ఉన్నది. టాటాకు చెందిన నిర్మాణ సంస్థ టాటా ఇన్ఫోమీడియా లిమిటెడ్ బచ్చన్ నటించిన చిత్రం ‘ఐత్‌బార్’కు నిధులు సమకూర్చింది. అయితే, ఆ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అంతగా స్పందన లేదు. టాటా గ్రూప్ సుమారు రూ. 3.5 కోట్ల మేర నష్టపోయిందని తెలుస్తోంది. రతన్ టాటా మృతి పట్ల ముందుగా సంతాపం తెలిపినవారిలో అమితాబ్ బచ్చన్ ఒకరు.

‘శ్రీ రతన్ టాటా కన్నుమూశారన్న వార్త ఇప్పుడే విన్నాను& నేను బాగా ఆలస్యంగా పని చేస్తున్నాను. ఒక శకం అంతరించింది అత్యంత గౌరవనీయుడు, వినమ్రశీలి, అపార దూరదృష్టి, సంకల్పం ఉన్న నేత. మేము కలసి పాల్గొన్న పలు కార్యక్రమాల్లో ఆయనతో కొన్ని అద్భుత క్షణాలు గడిపాను. ఆయనకు నా ప్రార్థనలు’ అని బచ్చన్ ‘ఎక్స్’ పోస్ట్‌లో రాశారు. ఈ నెల 11న ముంబయిలో జరిగిన రతన్ టాటా అంత్యక్రియలకు సచిన్ టెండూల్కర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండు, అమిత్ షా, ముఖేష్ అంబానీ సహా ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News