హైదరాబాద్: రతన్ టాటా మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపార వేత్త అని మోడీ కొనియాడారు. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వం అందించారని, మెరుగైన సమాజం కోసం ఆయన కృషి చేశారన్నారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్ టాటా శాశ్వత ముద్ర వేశారని ఎఐసిసి అగ్రనేత రాహుల్ ప్రశంసించారు.
పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాదిని భారత్ కోల్పోయిందని సిఎం రేవంత్ రెడ్డి బాధను వ్యక్తం చేశారు. రతన్ టాటా నిష్క్రమణ పారిశ్రామికరంగానికి, దేశానికి తీరనిలోటు అని అన్నారు. నిబద్దత, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు. దాతృత్వానికి ప్రతీక రతన్ టాటా అని రేవంత్ మెచ్చుకున్నారు.
దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా(86) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ముంబయిలోని క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి పదకొండున్నర గంటలకు తుదిశ్వాస విడిచారని టాటాసన్స్ ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించిన విషయం తెలిసిందే.