ఆధార్‌కు ఫోన్‌నెంబర్ అనుసంధానం చేస్తే నెలవారీ రేషన్
రెండు రోజుల నుంచి మీసేవ కేంద్రాల వద్ద బారులు కట్టిన జనం
ఫిబ్రవరి నెల రేషన్ పాత పద్దతిలోనే పంపిణీ చేయాలంటున్న కార్డుదారులు
హైదరాబాద్: నగరంలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే ఆధార్‌కు ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలని ఇటీవల జిల్లా పౌరసరఫరాల అధికారులు పేర్కొనడంతో నగర ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటిపి ఆధారంగా రేషన్ సరుకులను డీలర్లు ఈనెల 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. ఫోన్‌కు ఓటిపీ నెంబర్ రాకుండా రేషన్ ఇవ్వమని రేషన్ డీలర్లు తెగేసి చెప్పడంతో కార్డుదారులంతా మీ సేవ కేంద్రాలకు చేరుకుని ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకునేందుకు పడరాని తంటాలు పడుతున్నారు. జనం ఒకేసారి కేంద్రాల వద్దకు రావడంతో మీసేవ సెంటర్లు స్దానిక ప్రజలతో కిక్కిరిసి పోతున్నాయి. రోజు వారీ కూలీలు గత రెండు రోజులుగా సమీపంలో ఉన్న మీసేవ కేంద్రాలు క్యూలో నిలబడి ఆధార్‌కు పోన్‌నెంబర్ అనుసంధానం చేసుకునేందుకు అవస్దలు పడుతున్నారు. కరోనా మహమ్మారితో వేలిముద్రకు బదులు ఐరిస్, మొబైల్ నెంబర్ ఓటిపి ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభమైంది.
మూడు నెలల నుంచి ప్రయోగాత్మక కొన్ని ప్రాంతాల్లో ఓటీపి విధానం ద్వారా సరుకులు ఇస్తున్నారు. ఈనెల నుంచి ఖచ్చితంగా ఓటిపి విధానం అమలు చేయాలని ప్రభుత్వం అధికారికంగా పేర్కొనడంతో డీలర్లు ఆదిశగా ముందుకు వెళ్లుతున్నారు. దీంతో రేషన్ తీసుకోవడానికి లబ్దిదారులు ఆధార్‌కు ఫోన్‌నెంబర్ లింక్ చేసుకునేందుకు పనిలో పడ్డారు. పేదలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని సంబంధిత సేవలు అందించడంపై తపాలాశాఖ కూడా దృష్టి పెట్టింది. నగరంలో 670 చౌకధరల దుకాణాల ద్వారా ప్రతి నెలా సరుకులను బయోమెట్రిక్ పద్దతిలో పంపిణీ చేస్తున్నారు.కానీ కరోనా కారణంగా వేలిముద్రలు అథేంటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసి ఓటిపి పద్దతిని అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒకరు ఈనెలలో సరుకులు తీసుకోవాలంటే తప్పనిసరిగా తమ ఆధార్‌కార్డుకు ఫోన్ నెంబర్‌ను లింక్ చేసుకోవాల్సిందే సూచిస్తున్నారు. రేషన్ తీసుకునే సమయంలో ఫోన్‌నెంబర్‌కు ఓటిపి వస్తేనే సరుకులు పంపిణీ చేస్తామంటున్నారు.
ప్రతి రేషన్‌కార్డుదారు ఆధార్ సెంటర్‌కు వెళ్లి లింక్ చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.మలక్‌పేట, సైదాబాద్, బహుదూర్‌పురా, కార్వాన్,యాకుత్‌పురా, మెహిదిపట్నం, కాచిగూడ, నల్లకుంట, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్ వంటి ఏరియాల్లో జనం సొంత పనులు పక్కకు పెట్టి రేషన్ సరుకులు ఈనెల నుంచి రాకుంటే తరువాత నెల నుంచి కూడా ఇవ్వరని భావిస్తూ ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింక్ చేసుకునే పనిలో పడ్డారు. మరికొన్ని చోట్ల ప్రజలు ఈ ఫిబ్రవరి నెలవరకు పాత విధానంలో రేషన్ సరుకులు ఇచ్చి మార్చి నుంచి పూర్తిస్దాయిలో అమలు చేయాలని కోరుతున్నారు. ఇదే అదునుగా భావించిన మీసేవా కేంద్రాల నిర్వహకులు గతకంటే రెండింతలు ఫీజుల పెంచారు. ఎక్కువ చెల్లించిన వారికే ముందుకు అనుసంధానం చేస్తూ మిగతా వారిని గంటల తరబడి సెంటర్ల వద్ద నిలబెడుతున్నారని రేషన్ కార్డుదారులు వాపోతున్నారు.
Ration Card New Rules in Telangana