Saturday, November 23, 2024

రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం అర్బన్ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు కనీసం రెండు పూటల ఆహారం అందించాలనే తలంపుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం విదితమే. అయితే రేషన్ డీలర్ల ద్వారా లబ్ధిదారులకు సరఫరా చేయాల్సి ఉండగా సంబంధిత వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పలు అక్రమాలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కంటే కొసరు ముద్దు అన్నట్లుగా పేదలకు అందాల్సిన ఫలాలు డీలర్లు, మిల్లర్లు పొందుతున్నారు. ప్రతీ నెల మొదటి తేదీన సివిల్ సప్లై గోదాముల ద్వారా నిర్ధేశిత రేషన్ షాపులకు టంచన్‌గా బియ్యం సరఫరా చేస్తారు.అయితే స్టాక్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన రెవిన్యూ అధికారులు నిర్లక్ష ధోరణితో వ్యవహరిస్తున్న కారణంగా ఈ బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తుంది. ఓ

వైపు షాపులకు వచ్చే మహిళలకు నేరుగా బియ్యానికి బదులు నగదు చెల్లిస్తూ సొమ్ము చేసుకుంటూనే నిల్వ ఉన్న రైస్‌ను మిల్లర్లకు తరలించి ప్రతినెల భారీగా అక్రమంగా ఆర్జిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. పట్టణ పరిధిలోని రామవరం ప్రాంతంలో బినామిల పేరుతో షాపు ఒకరిది అయితే అతనికి బదులుగా వేరొకరు నిర్వహిస్తుండడం వంటి విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల నునావత్ వెంకటేశ్వర్లు షాప్ నెంబర్ 3031020కు డీలర్‌గా వ్యవహరిస్తున్న తరుణంలో గురువారం సంబంధిత అధికారులు తనిఖీ చేయగా ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. బియ్యం నిలువలను పరిశీలిస్తున్న సమయంలో 109.86 కేజీలు వాస్తవంగా ఉండాలి. కాని 91.00 మాత్రమే ఉండడంతో మిగిలిన బియ్యం ఎక్కడికి వెళ్లాయనే విషయంపై విచారణ జరపాల్సి ఉండగా ఆ సమయంలో అక్కడికి వచ్చిన అధికారి తూతూ మంత్రంగా డీలర్‌పై 6ఎ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.

గతంలోనూ ఈ డీలర్‌పై ఇదే తరహాలో పలు కేసులు నమోదు అయినప్పటికీ పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతూ అక్రమాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున ఆర్జించినట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది. రెండేళ్ల క్రితం చుంచుపల్లి మండల పరిధిలోని త్రీ ఇంక్లైన్ షాపులకు రెండుమార్లు రేషన్ పంపినట్లు లెక్క తేలినప్పటికీ అధికారులు కఠినంగా వ్యవహరించకుండా తిరిగి అదే వ్యక్తికి షాపు నిర్వహణ బాధ్యత అప్పగించడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ ప్రాంతంలో జరుగుతున్న రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని పేదలకు అందాల్సిన బియ్యాన్ని సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News